ప్రతిపక్ష నేతగా జగన్ విఫలం

Update: 2015-12-22 17:30 GMT
ప్రతిపక్ష నేతగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిసారీ విఫలమవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం అనుభవ రాహిత్యమే. అసెంబ్లీ రాహిత్యంతో ఆయన అధికార పార్టీ తప్పులను సమర్థంగా ఎత్తి చూపించడమే కాకుండా దానిని ఇరుకున పెట్టడంలోనూ విఫలమవుతున్నారు. నవ్యాంధ్ర ప్రారంభమైన రోజు నుంచీ ఇదే పరిస్థితి పదే పదే కొనసాగుతోంది. భవిష్యత్తులోనూ ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు ఆయన నాయకత్వాన్ని శంకించే పరిస్థితులు తీవ్రమవుతాయి.

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి.. ఇది కొన్ని దశాబ్దాల కిందటి నాటి మాట. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో లేవనెత్తితే ప్రతిపక్షాలను పక్కదారి పట్టించి, బెదిరించి, బతిమాలి ప్రజా సమస్యలు అసెంబ్లీలో చర్చకు రాకుండా అడ్డుకోవాలి. సమావేశాలను దారి మళ్లించాలి.. ఇది ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కొత్తగా వచ్చిన జాడ్యం. ఏపీ అసెంబ్లీ ప్రారంభం అయిన నాటి నుంచి ఇదే జరుగుతోంది.

అసెంబ్లీ సమావేశాలకు ముందే సరిగ్గా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏదో ఒక అంశం తెరపైకి వస్తోంది. అందులో అధికార పార్టీ నేతల పాత్ర ఉండడమో, వైఫల్యం ఉండడమో ఏదో జరుగుతోంది. దానిని ఉపయోగించుకునేందుకు ప్రతిపక్షం పావులు కదుపుతోంది. ప్రతిపక్షాన్ని పక్కదారి పట్టించడానికి అధికార పక్షం ప్రతి వ్యూహాలు రచిస్తోంది. దాని ప్రతి వ్యూహాల్లో చిక్కుకుని ప్రతిపక్షం పూర్తి స్థాయిలో విఫలం అవుతోంది.

ఇప్పుడు కూడా కాల్ మనీ వ్యవహారం ప్రతిపక్షానికి అంది వచ్చిన అవకాశంలా వచ్చింది. దానితో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని భావించింది. కాల్ మనీ వ్యవహారం చర్చకు వస్తే తాము ఇరుకున పడతామని టీడీపీ భావించింది. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టడం ప్రారంభించింది. ఆ ఉచ్చులో చిక్కుకున్న వైసీపీ.. మరింత రెచ్చిపోయి రోజా బహిష్కరణ వరకూ తెచ్చుకుంది. అదే ఊపులో ఏకంగా అసెంబ్లీ బహిష్కరణకే పిలుపునిచ్చింది. ఇక్కడ వైసీపీ కాస్త సంయమనంతో ఉంటే అధికారపార్టీని పూర్తి స్థాయిలో ఇరుకున పెట్టడానికి, ప్రజల్లో పలుచన చేయడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు వైసీపీయే ప్రజల్లో పలుచన అయ్యే పరిస్థితి తెచ్చుకుంది. కాల్ మనీ వ్యవహారంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా టీడీపీ బయటపడిపోయింది. అసెంబ్లీ సమావేశాల మొదటి నుంచీ టీడీపీ ఇటువంటి ఎత్తులు వేస్తూనే ఉంది. వాటికి వైసీపీ మరీ ముఖ్యంగా జగన్ చిత్తవుతూనే ఉన్నాడు. రాజకీయ వ్యూహంపై ఆత్మ విమర్శ చేసుకోకపోతే వైసీపీ రాజకీయంగా కనుమరుగు కావడానికి ఎంతో సమయం పట్టదు.

Tags:    

Similar News