ఇవే పార్టీని నిలువునా ముంచేస్తున్నాయి కోమటిరెడ్డి?

Update: 2020-12-06 08:30 GMT
కాంగ్రెస్ నేతల తీరు చాలా సిత్రంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వారి తీరు ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఓవైపు తెలంగాణలో పార్టీ పరిస్థితి అంతకంతకూ దిగజారి పోయినప్పటికీ పార్టీ పదవుల కోసం నేతల ఆరాటం చూస్తే విస్మయం కలుగకమానదు. అదే పనిగా మీడియా ముందుకు వచ్చి.. పార్టీ పదవులు కావాలని.. తాను రేసులో ఉన్నట్లుగా మాటలు చెప్పే బదులు.. పార్టీ కోసం కమిట్ మెంట్ తో పని చేసే ధోరణి మాత్రం కనిపించదు.

మొన్న జరిగిన దుబ్బాకలో చాలామంది కాంగ్రెస్ నేతలు పని చేసినా ఎలాంటి ఫలితం వచ్చిందో తెలిసిందే. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో ఒక్క రేవంత్ రెడ్డి మినహా మిగిలిన నేతలు (ఇతర జిల్లాల వారు) పెద్దగా కనిపించింది లేదు. పార్టీ తరపున బరిలో నిలుచున్న అభ్యర్థులు.. ఎన్నికల ఖర్చుల కోసం వారు పడిన ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఇలాంటివేళలో.. కోమటిరెడ్డి లాంటి పదవులు ఆశించే నేతలు సీన్లోకి వెళ్లి.. వారి అవసరాల్ని తీర్చింది లేదు.

గ్రేటర్ లో పార్టీ పరిస్థితి దారుణంగా మారిన నేపథ్యంలో కనీసం.. ఉనిక కోసమైనా కాంగ్రెస్ నేతలు పోరాడింది లేదని చెప్పాలి. ఒకరిద్దరునేతలు వ్యక్తిగతంగా అభ్యర్థులకు అయ్యే ఖర్చుల్ని పెట్టుకున్నారు. ఇలా పార్టీ కోసం తపించే నేతలు ఒకవైపు.. నిత్యం పదవి కోసం తపించే కోమటిరెడ్డి లాంటి వారి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువనిచెప్పాలి. అయినా.. నిజాయితీతో కష్టపడి పని చేస్తూ.. పార్టీ  గెలుపుకోసం ప్రయత్నిస్తే.. కోమటిరెడ్డి అంతలా ఆరాటపడుతున్న పీసీసీ చీఫ్ పదవిని పార్టీనే బహుమతిగా ఇస్తుంది కదా? ఆ విషయాన్ని ఆయన ఎందుకు అర్థం చేసుకోనట్లు? పదవుల కోసం ఆరాటం మంచిదే కానీ.. అంతకు మించిన అందరూ వేలెత్తి చూపేలా ఉన్న తీరు వెంపర్లాటను గుర్తు చేస్తుందన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News