బీజేపీని వదిలించుకోవటం ఖాయమేనా ?

Update: 2021-09-25 13:30 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మిత్రపక్షం బీజేపీని వదిలించుకోవటం ఖాయమైపోయిందా ? పరిషత్ ఎన్నికల ఫలితాలపై పవన్ చేసిన తాజా వ్యాఖ్యలను చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. బీజేపీకి కేటాయించిన సీట్లలో కమలనాథులు ఇంకా బాగా పని చేసుంటే మరిన్ని మంచి ఫలితాలు వచ్చేవన్నారు. బీజేపీ నేతల పనితీరు సరిగా లేని కారణంగానే ఫలితాల్లో తేడా వచ్చిందని పవన్ అన్నారు. ఎన్నికల్లో సాధించిన ఫలితాలపై తొందరలోనే బీజేపీ-జనసేన పార్టీల నేతలు కూర్చుని మాట్లాడుకుంటాయని కూడా చెప్పారు.

పవన్ తాజా వ్యాఖ్యలు చూసిన తర్వాత కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఎంపీటీసీ ఫలితాల్లో జనసేనకు 177 గెలవగా, బీజేపీ 28 చోట్ల మాత్రమే గెలిచింది. ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే స్థానికంగా సర్దుబాట్లు, అవసరాలు, అవకాశాల కారణంగా టీడీపీ+జనసేన కలిసిపోయాయి. అంటే జనసేన తన మిత్రపక్షం బీజేపీని కాదని టీడీపీతో కలిసి పనిచేసిందనే ఆరోపణలు ఎక్కువైపోతున్నాయి.

ఉభయగోదావరి జిల్లాల్లోని పి గన్నవరం, ఆచంట, అమలాపురం లాంటి కనీసం పది మండలాల్లో రెండు పార్టీలు కలిసి అవగాహనతో పనిచేశాయట. అందుకనే జనసేన 177 ఎంపీటీసీల్లో గెలిచినట్లు స్థానిక నేతలే చెబుతున్నారు. సరే గెలుపుకోసం ప్రతి పార్టీ తనదైన స్టైల్లో ఏదో ఒక వ్యూహాన్ని రచించుకుంటుంది. అందులో తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ జనసేనేమో మిత్రపక్షాన్ని వదిలిపెట్టేసి ఏ సంబంధం లేని టీడీపీతో కలిసింది. కానీ ఫలితాల తర్వాత ఇపుడు నిందలేమో బీజేపీపై మోపుతోంది.

అసలు బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తేనే కదా ఆ పార్టీకి ఇంకా మంచి ఫలితాలు వచ్చేది ? కాబట్టి పవన్ వరస చూస్తుంటే తొందరలోనే బీజేపీని వదిలిపెట్టేసి తెలుగుదేశం పార్టీతో చేతులు కలపడానికి రెడీ అవుతున్నారనే సందేహం పెరిగిపోతోంది. నిజానికి 28 ఎంపీటీసీల్లో గెలిచేంత సీన్ బీజేపీకి లేదు. అలాగే 177 ఎంపీటీసీల్లో గెలిచేంత బలం జనసేనకూ లేదు. అయినా గెలవటమే విచిత్రంగా ఉంది.

రెండు పార్టీల బలం పెరిగిందనే అనుకున్నా మిత్రపక్షాలుగా మరింత ఐకమత్యంగా పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకోవాలి. అంతేకానీ బీజేపీని తక్కువ చేసి మాట్లాడటం ఏమిటో పవనే చెప్పాలి. జరుగుతున్నది చూసిన తర్వాత తొందరలోనే కమలం పార్టీకి పవన్ టాటా చెప్పేయటం ఖాయమనే అనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయాలని డిసైడ్ చేశారు పవన్.

ఈ విషయమై ఈనెల 27,28 తేదీల్లో సమావేశం జరిపి కార్యాచరణను రెడీ చేస్తామన్నారు. ఇక్కడ కూడా బీజేపీ గురించి ప్రస్తావించలేదు. ఇదే సమయంలో బీజేపీ కూడా ఆందోళనలు ఒంటరిగానే చేస్తోంది. రెండుపార్టీలు కలిసి చేసిన ఆందోళనలు చాలా తక్కువన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి అనేక కారణాల వల్ల మిత్రపక్షాలు విడిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది.
Tags:    

Similar News