ఏపీ హైకోర్టులో ఆసక్తికర వ్యాఖ్యలు.. సీఎం జగన్ క్రిస్టియన్ అని ఎలా చెబుతారు?

Update: 2020-10-20 09:10 GMT
ఏపీ హైకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల కాలంలో ఏపీ సర్కారు.. ఏపీ ముఖ్యమంత్రికి సంబంధించి ఏ పిటీషన్ వచ్చినా.. స్పందిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయటం తెలిసిందే. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇలాంటివేళ.. తాజాగా ఒక కేసు విచారణలో ఏపీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు హాజరైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వలేదని.. అధికారులు సైతం నిబంధనలు పాటించలేదంటూ గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణ తాజాగా సాగింది. ఈ పిటిషన్ లో గవర్నర్ ను ప్రతివాదిగా పేర్కొనటంపై హైకోర్టు అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. తమకు తామే సుమోటోగా పేరును తొలగిస్తున్నట్లు పేర్కొంది.

ఈ సందర్భంగా రిజిస్ట్రీని పిలిచి మరీ.. ఆ పిటిషన్ కు నెంబరు ఎలా వేస్తారని ప్రశ్నించింది. పిటిషన్ తరఫు న్యాయవాది పీవీ క్రిష్ణయ్య వాదనలు వినించారు. జగన్ క్రిస్టియన్ అని చెప్పేందుకు ఏదైనా ఆధారం ఉందా? అని ప్రశ్నించారు. హిందూయేతరులు శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలని.. దాన్ని జగన్ పాటించలేదన్నారు. ప్రభుత్వం రూపొందించిన చట్టాల్ని ప్రభుత్వాధినేతే ఉల్లంఘించటం సరికాదన్నారు.

ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మంత్రులు వెల్లంపల్లి.. కొడాలి వ్యాఖ్యలు చేశారన్నారు. జగన్ ఏ మతస్తుడన్న దానిపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని.. వాటిని నివృత్తి చేయాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉందన్నారు. జగన్ క్రిస్టియన్ అనే దానికి ఏదైనా ఆధారం ఉందా? అని ప్రశ్నించగా.. సీఎం డిక్లరేషన్ఇవ్వాల్సిన అవసరం లేదని.. దీనిపై టీవీల్లో చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు.

దీనిపై జస్టిస్ దేవానంద్ స్పందిస్తూ.. టీవీల్లో జరిగినచర్చల గురించి చెప్పొద్దని చెప్పింది. మీ దగ్గరజగన్ క్రిస్టియన్ అని చెప్పేందుకు ఆధారాలు ఏమున్నాయని అడిగినప్పుడు.. ఈ విషయంపై ముఖ్యమంత్రే స్పష్టత ఇవ్వాలని కోరాలన్నారు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. ఆయనది ఏ మతమో ముఖ్యమంత్రిని తాము ఎందుకు అడగాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి.. ఆయన కుటుంబ సభ్యులు క్రైస్తవ సభల్లో పాల్గొన్నారని.. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నారని.. అందుకే ఆయన్నుక్రిస్టియన్ గా భావించాల్సి వస్తోందన్నారు. దీనికి మరోసారి స్పందించిన న్యాయమూర్తి.. శ్రీరామ్ అని పేరు పెట్టుకుంటే హిందువని.. దేవానంద్ పేరు పెట్టుకుంటే క్రిస్టియన్ అని ఎలా అనుకుంటామని ప్రశ్నించారు.

జగన్ క్రిస్టియన్ అని చెప్పేందుకు అవసరమైన ఆధారాల కోసం తమకు రెండు రోజులు సమయం ఇవ్వాలని కోరారు. దీనికి అంగీకరించిన కోర్టు.. న్యాయవాది అడిగిన సమయాన్ని ఇచ్చారు. ఇటీవల జరుగుతున్న చర్చల వేళ.. జరిగిన ఈ వాదనలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Tags:    

Similar News