మనోడు ఆ దేశంలో ఎంపీగా ఎన్నికై.. సంస్కృతంలో ప్రమాణస్వీకారం

Update: 2020-11-26 05:30 GMT
ఎంత ఎత్తుకు ఎదిగినా.. మూలాల్ని మర్చిపోని వారు కొందరు కనిపిస్తారు. ఆ కోవకే చెందుతారు భారత సంతతికి చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ. ఎక్కడా ఇతగాడి పేరు విన్నట్లు లేదే అంటారా? అవును.. మీడియాలో పెద్దగా నానని పేరు. ఎవరికి తెలీని వ్యక్తి. కానీ.. అతడు చేసిన ఒక పనితో ఇప్పుడు అందరి కంట్లో పడటమే కాదు.. భారతీయుల మనసుల్ని దోచేశారు. ఇంతకూ ఆయన చేసిన పనేమిటంటారా? అక్కడికే వస్తున్నాం.

హిమాచల్ ప్రదేశ్ కు చెందిన శర్మ.. న్యూజిలాండ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా తన పదవీ ప్రమాణస్వీకారం సందర్భంగా అతడు సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశాడు. ఓవైపు తన మూలాల్ని మర్చిపోని శర్మ.. మరోవైపు స్థానికుల మనోభావాలని అర్థం చేసుకొని.. స్థానిక భాష అయిన మౌరిలోనూ ప్రమాణస్వీకారం చేశారు. తొలుత స్థానిక భాషలో.. తర్వాత సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేయటం ద్వారా.. తానెంత ఎదిగినా తన మూలాల్ని మర్చిపోలేదన్న సందేశాన్ని ఇచ్చారు.

అక్లాండ్ లో ఎంబీబీఎస్ చేసిన శర్మ తర్వాత అమెరికాలో ఎంబీఏ పూర్తి చేశారు. హిందీలో ప్రమాణస్వీకారం చేయటం కంటే కూడా.. సంస్కృతంలో చేయటం ద్వారా భారతీయ భాషల్ని గౌరవించినట్లు అవుతుందన్న ఉద్దేశంతో ఆయనీ పని చేసినట్లుగా చెబుతున్నారు. ఇక.. న్యూజిలాండ్ లో ఇప్పటికే భారత సంతతికి చెందిన ప్రియాంక రాధాకృష్ణన్‌ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శర్మ ఎంపీగా ఎన్నికయ్యారు. మరి.. మనోడ్ని అభినందిద్దామా?
Tags:    

Similar News