విప్రోలో ఇంక్రిమెంట్లు.. టెకీల్లో చిగురిస్తున్న ఆశలు

Update: 2020-11-09 14:50 GMT
భారతీయ ఐటీ దిగ్గజం విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెరుగనున్నాయి. కరోనా లాక్​డౌన్​ వేళ ఉద్యోగులు పనితీరుకు మెచ్చి సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. కరోనా ఎఫెక్ట్​తో ఐటీరంగంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ విప్రో తట్టుకొని నిలబడింది. దీంతో ప్రస్తతం తమ కంపెనీలోని ఉద్యోగులకు వేతనాలు పెంచింది. అయితే కంపెనీలో 80 శాతం మంది ఉద్యోగులకు ఈ హైక్​ వర్తించనున్నది. డిసెంబర్ 1న వాళ్లు పెరిగిన జీతాలను అందుకోనున్నారు. ప్రస్తుతానికి బీ3, దిగువ స్ధాయి ఉద్యోగులకు మాత్రమే ఇంక్రిమెంట్లు వర్తింపజేశారు. సీనియర్​ ఉద్యోగుల జీతాల పెంపుపై కంపెనీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు.  

విప్రో ప్రస్తుతం మనదేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ.. ఈ సంస్థలో మొత్తం 1.85 లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు 1.5 లక్షల మంది వేతనం పెరుగనున్నది. మెరుగైన పనితీరు కనబర్చిన వారికి వేతనాలు పెంచుతున్నట్టు సంస్థ యాజమాన్యం తెలిపింది. కరోనా ఎఫెక్ట్​తో కొంతకాలంగా ఐటీ కంపెనీలు వేతనాలను పెంచడం లేదు. ఇప్పటికే పలుమార్లు ఇంక్రిమెంట్లను ఎత్తివేశాయి. మరికొన్ని కంపెనీల్లో కొత్త నియామకాలను కూడా ఆపేశారు.

కానీ ప్రస్తుతం మళ్లీ ఐటీ కంపెనీలు వేతనాలు పెంచుతుండటంతో ఉద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్​, ఇన్ఫోసిస్​లు కూడా ఇంక్రిమెంట్లు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ‘కరోనా లాక్​డౌన్​లోనూ మా ఉద్యోగులు ఎంతో బాగా పనిచేశారు. అందుకే వారి శ్రమకు తగిన ఫలితాన్ని ఇస్తున్నాం’ అని విప్రోకు చెందిన ప్రతినిధి మీడియాకు చెప్పారు. ఏది ఏమైనప్పటికీ కరోనా సంక్షోభంలో వేతనాలు పెరగడంతో ఉద్యోగులు హ్యాపీగా ఉన్నారు.
Tags:    

Similar News