హుజూరాబాద్ః సాగర్ అవుతుందా.. దుబ్బాక అవుతుందా?

Update: 2021-06-16 05:30 GMT
స‌రిగ్గా నెలన్న‌ర పాటు సాగిన‌ ఈట‌ల ఎపిసోడ్ ముగిసింది. అధికారికంగా కాషాయ తీర్థం పుచ్చుకోవ‌డంతో ప‌రిస‌మాప్తం అయ్యింది. ఇక పోరాటానికి తెర‌లేవ‌నుంది. ఈట‌ల రాజీనామాను స్పీక‌ర్ ఆమోదించ‌డంతో.. ఉప ఎన్నిక ఖాయ‌మైపోయింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఉప ఎన్నిక‌లు ఒకెత్త‌యితే.. హుజూరాబాద్ స‌మ‌రం మ‌రో ఎత్తు కానుంది. ఇక్క‌డ గెలుపు ఎవ్వ‌రికీ అంత ఈజీకాద‌న్న‌ది వాస్త‌వం. మ‌రి, ఏం జ‌ర‌గ‌బోతోంది? హుజూరాబాద్ మరో దుబ్బాక అవుతుందా? లేదా నాగార్జున సాగర్ అవుతుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి మొద‌లై.. దాదాపు రెండు ద‌శాబ్దాలపాటు ఆ పార్టీలో కొన‌సాగారు ఈట‌ల‌. ఇన్నేళ్ల కాలంలో హుజూరాబాద్ ప్ర‌జ‌ల‌తో ఆయ‌న ఎంతో మ‌మేకం అయ్యారు. ఆ విష‌యం.. మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ త‌ర్వాత వెల్లువెత్తిన మ‌ద్ద‌తే తెలియ‌జేసింది. దాదాపు 90 శాతం మంది అధికార పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులు ఈట‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపారు. ఆయ‌న‌పై వేటు వేయ‌డాన్ని ఖండించారు. ఆ త‌ర్వాత ప్ర‌భుత్వం మంత్రి గంగుల‌ను రంగంలోకి దించ‌డంతో కాస్త మార్పు వ‌చ్చింద‌న్న‌ది వేరే సంగతి. అంటే.. మొత్తానికి ఈట‌ల స్థానికంగా చాలా బ‌లంగా పాతుకుపోయార‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. ఈ బ‌లాన్నే ఈట‌ల న‌మ్ముకున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీలో చేర‌డంతో మ‌రింత బ‌లం తోడైంద‌నే అభిప్రాయంలో ఉన్నారు.

ఇక‌, టీఆర్ఎస్ నేత‌లు చెబుతున్న‌ది ఏమంటే.. ఈట‌ల గులాబీ గుర్తుపై గెలిచారు త‌ప్ప‌, ఆయ‌న వ్య‌క్తిగ‌త చ‌రిష్మా పెద్ద‌గా లేదంటున్నారు. అయితే.. అభిప్రాయాలు ఎలా ఉన్నా.. గెలుపు ముఖ్యం కాబ‌ట్టి టీఆర్ఎస్ రాజీ లేకుండా పోరాటం సాగించ‌డం త‌థ్యం. అందులోనూ అధికార పార్టీగా ఉన్న‌ది కాబ‌ట్టి.. స‌ర్వ‌శ‌క్తులూ ఒడ్డుతుంది. అందుబాటులో ఉన్న ప్ర‌తీ అవ‌కాశాన్నీ వినియోగించుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు.

ఈ విధంగా ఇరు వ‌ర్గాలు బ‌ల‌మైన పోరుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇద్ద‌రికీ ఈ గెలుపు ఎంత ముఖ్య‌మ‌నేది చెప్పాల్సిన ప‌నిలేదు. ఓడిపోతే.. ఇన్నాళ్లూ టీఆర్ఎస్ బ‌లంతో ఈట‌ల‌ ఎదిగాడు త‌ప్ప‌.. ఆయ‌న వ్య‌క్తిగ‌త బ‌లం ఏమీ లేద‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌వ‌స్తుంది. త‌ద్వారా ఒక సాధార‌ణ నాయ‌కుడిగా మిగిలిపోతాడు. గెలిస్తే.. మాత్రం కేసీఆర్ ను ఢీకొట్టే నాయ‌కుడు అన్న‌ది వాస్త‌వం అవుతుంది. అటు టీఆర్ఎస్ కు సైతం ఈ గెలుపు ఎంతో ముఖ్యం. ఓడిపోతే.. టీఆర్ఎస్ ప‌త‌నం మొద‌లైంద‌న్న ప్ర‌చారం ఊపందుకుంటుంది. దుబ్బాక త‌ర్వాత వ‌చ్చిన ప్ర‌చారానికి రెట్టింపు మొద‌ల‌వుతుంది. కాబ‌ట్టి.. ఇది అధికార పార్టీకి ఏ మాత్రం మంచిది కాదు. ఈ విధంగా.. ఇరు వ‌ర్గాలూ అన్ని అస్త్రాల‌ను ప్ర‌యోగించి యుద్ధంలో గెలుపుకోసం పోరాటం చేయ‌నున్నాయి.

మ‌రి, ఏం జ‌ర‌గ‌బోతోంది అన్న‌ది ఆస‌క్తిక‌రం. హుజూరాబాద్ మ‌రో దుబ్బాక అవుతుందా? లేక నాగార్జున సాగర్ అవుతుందా? అన్న‌ది చూడాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌ను ఈ ఉప ఎన్నిక చాలా వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తుంద‌ని చెప్ప‌డంలో సందేహం లేదు.
Tags:    

Similar News