యాదాద్రిలో అలాంటి అపచారం జరిగిందా?

Update: 2019-12-04 04:45 GMT
సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో నిజం ఎంతన్నది పక్కన పెడితే.. సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే తెలుగు మీడియా సంస్థల్లో ఒక సంస్థ.. తాజాగా పబ్లిష్ చేసిన కథనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరూ అవాక్కు అయ్యేలా చేస్తోంది. తన కథనంలో పేర్కొన్న అంశానికి సంబంధించిన ఏ ఒక్క ఆధారాన్ని చూపించనప్పటికీ.. ఘోరాపచారం జరిగినట్లుగా పేర్కొంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలగా చెప్పే యాదాద్రి పుణ్యక్షేత్రంలో వందల కోట్లు ఖర్చు పెట్టి భారీ ఎత్తున పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే. యాదాద్రిని పుణ్యక్షేత్రంగా మార్చేందుకు వీలుగా ఇప్పటికే పక్కా ప్లాన్ తయారు చేసి.. అమలు చేస్తున్నారు. ఇలాంటివేళ.. ఆలయంలో తన ఫోటోను.. పార్టీ సింబల్ ను చెక్కించుకున్నారన్న ఆరోపణలు సంచలనంగా మారటం.. వాటిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం తెలిసిందే.

దీంతో.. ఈ అంశం వివాదంగా మారటంతో వాటిని తొలగించారు. తాజాగా యాదాద్రికి సంబంధించి మరో సంచలన విషయం బయటకు వచ్చింది. యాదాద్రి పనులు నిర్వహిస్తున్న ఆర్కిటెక్ట్.. శిల్పులు.. పెద్దల అనుమతి లేకుండా స్వయంభువు విగ్రహంలో మార్పులు చేసినట్లుగా చెబుతున్నారు. యాదాద్రిలో వేంచేసి ఉన్న స్వయంభూ విగ్రహం శాంతమూర్తిగా.. కోరలు ఉండవని.. నాలుక బయటకు కనిపించదని.. తలపై ఏడు తలల ఆదిశేషుడు ఉంటాడని.. అందుకు భిన్నంగా తలపై ఐదు తలల ఆదిశేషుడు.. నాలుక బయటకు చాపి.. కోరలు ఉండేలా మార్పులు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

అంతేకాదు కిరీటానికి.. ఆదిశేషుడికి మధ్య ఉండాల్సిన వెడల్పు కూడా పెరిగినట్లుగా ఆరోపిస్తున్నారు. మూల విరాట్టుకు సంబంధించి ఫోటోలు తీయటం.. వాటిని పబ్లిష్ చేయటం పాపమన్న సంప్రదాయానికి విరుద్ధంగా స్వయంభువు విగ్రహాన్నే చెక్కటం.. శిల్పులు సెల్ఫీలు దిగటం యాదాద్రిలో సంచలనంగా మారినట్లు చెబుతున్నారు.

తాము చేసిన ఆరోపణలకు వివరణను యాదాద్రి ప్రధానార్చకులు లక్ష్మీ నరసింహాచార్యుల వ్యాఖ్యను జత చేశారు. దశాబ్దాలుగా సింధూరం పూస్తున్నామని.. ఆ పూత మందం పట్టటంతో సిందూరాన్ని మాత్రమే తొలగించామే తప్పించి ఇంకేమీ చేయలేదన్న వివరణ ఆయన ఇస్తున్నారు. మూల విరాట్టును ఎవరూ ఎప్పుడూ ఉలితో చెక్కలేదని.. కానీ పాత గుడి కంటే ప్రస్తుత ఆలయ నిర్మాణంలో పలు లోపాలు జరిగిన మాట వాస్తవమని ఆయన పేర్కొనటం గమనార్హం.

ఈ వ్యవహారం చినజీయర్ స్వామి వరకూ వెళ్లటం.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో నిజమెంత అన్న విషయాన్ని తేల్చేందుకు తన సన్నిహితుల్ని యాదాద్రికి పంపారని.. వారు కూడా మూల విరాట్టుకు మార్పులు జరిగిన విషయాన్ని ధ్రువీకరించినట్లుగా కథనంలో పేర్కొన్నారు. ఈ వ్యవహారం కలకలంగా మారటమే కాదు.. పెను సంచలనంగా మారింది. మరీ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News