హరీశ్ కు బాధ్యత ఇవ్వటం అంటే.. ఓటమిని కేసీఆర్ ఒప్పుకున్నట్లేనా?

Update: 2021-03-01 00:30 GMT
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ పని ఊరికే చేయరు. ఆయన చేసే ప్రతి పనిలో ఏదో ఒక మర్మం ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఆయన తన సందేశాన్ని తన చేతలతో చెప్పేస్తుంటారు. తాజాగా జరుగుతున్న హైదరాబాద్.. రంగారెడ్డి.. మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో కీలకమైన రంగారెడ్డి జిల్లా ప్రచార బాధ్యతల్ని మంత్రి హరీశ్ కు అప్పజెప్పటం తెలిసిందే.

ఇంతకు ముందు వరకు ఈ ఎన్నికకు సంబంధించి మంత్రి కేటీఆర్ చూసుకునే వారు. ఇప్పుడు కూడా ఆయన చూస్తున్నప్పటికీ.. హరీశ్ కు బాధ్యతలు అప్పజెప్పటం అంటే.. ఓటమి భయం కేసీఆర్ ను వెంటాడుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. నిజానికి హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ కు బలం లేదు. మిగిలిన ఎన్నికలకు కాస్త భిన్నమైన ఫార్మాట్ లో ఉండే ఈ ఎన్నిక మీద టీఆర్ఎస్ కు పెద్ద పట్టు లేదని చెప్పాలి.

ఈ ఎన్నికకు సంబంధించి సంప్రదాయక ఓటర్లు ఎక్కువగా అభ్యర్థిని చూసి ఓట్లు వేసే ధోరణి ఎక్కువ. పార్టీ కంటే కూడా అభ్యర్థికే ప్రాధాన్యత ఇస్తారు. ఈ కారణంతోనే ఓటు వేసే సమయంలో ఇచ్చే బ్యాలెట్ పేపర్లో క్రమ సంఖ్య.. అభ్యర్థి పేరు.. వారికి కేటాయించిన నెంబరు ఇస్తారే తప్పించి.. గుర్తులు ఏమీ ఇవ్వరన్నది మర్చిపోకూడదు. ఈ ఎన్నికను తొలుత కేటీఆర్ కు అప్పగించటానికి కారణం.. సులువుగానే ఈ సీటును సొంతం చేసుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతారు.

అయితే.. అందుకు భిన్నంగా వివిధ పార్టీలు.. స్వతంత్రులుగా బరిలో ఉన్న అభ్యర్థుల్ని చూసిన తర్వాత.. వారి ప్రచార సరళిని పరిశీలించిన తర్వాత కేటీఆర్ ఒక్కడితో కాదన్న విషయాన్ని గ్రహించిన గులాబీ బాస్.. వెంటనే అదనపు బలగాల్ని ఎన్నికల ప్రచారానికి దించారని చెప్పాలి. ఇందులోభాగంగానే ట్రబుల్ షూటర్ సాయం టీఆర్ఎస్ కు అవసరమైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్న విపక్షాలు.. తెలంగాణ అధికారపక్షాన్ని తమ మాటలతో ఒత్తిడికి గురి చేస్తున్నాయి.
Tags:    

Similar News