జీహెచ్ఎంసీ ఫలితాలు: కాంగ్రెస్ ఖతం.. అడ్రస్ లేని టీడీపీ

Update: 2020-12-04 06:54 GMT
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మించి బీజేపీ తొలి రౌండ్ లో దూసుకెళ్లింది. పోస్టల్ బ్యాలెట్ లో ఓడించింది. దీంతో ఇప్పుడు ప్రజల ఓట్లలో బీజేపీ అదే ఫలితం రిపీట్ చేస్తే గులాబీ కోటను బద్దలు కొట్టినట్టే.  దుబ్బాకలో దెబ్బకొట్టిన బీజేపీ గ్రేటర్ లోనూ కొడుతుందా లేదా అన్నది సాయంత్రం వరకు తేలనుంది.

అయితే ఇప్పుడు అంతా బీజేపీ, టీఆర్ఎస్ ఫైట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తెలంగాణలో ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్ ను ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోవడంలేదు. అటు జనాలు వదిలేసి.. ఇటు మీడియా కూడా లైట్ తీసుకుంది. కారణం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. ఇక ఒకప్పుడు తెలంగాణ లో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ అసలు ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.

దుబ్బాక ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ అదే పంథాను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు, మూడు స్థానాల్లోనే ఆధిక్యతను కనబరుస్తూ ఉండడం ఒక జాతీయ పార్టీకి రావలసిన ఫలితం కాదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

జీహెచ్ఎంసీ ఫలితాల సరళి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం పోరాడుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో 3వ స్థానంలో ఉన్న బీజేపీ టీఆర్ఎస్ ను ఓడించినంత పనిచేస్తుంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు సీట్ల కోసం అగచాట్లు పడుతుండడం కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను జీర్ణించుకునేలా చేయడం లేదు.
 
దుబ్బాకలో ఓడి.. జీహెచ్ఎంసీలోనూ అదే ట్రెండ్ ను కాంగ్రెస్ కొనసాగిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ ఖతమైనా ఆశ్చర్యపోనవసరం లేదన్న టాక్ వినిపిస్తోంది.  ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ, ఆపై జరగనున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లోనూ పునరావృతం అయితే డేంజర్ బెల్స్ అని చెప్పొచ్చు.. ఇక తాజా ఫలితాలను బట్టి కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతుంది, తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోల్పోతుంది అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Tags:    

Similar News