మోదీ ఇన్ రష్యా మీట్స్ పుతిన్..విశేషాలేమిటంటే?

Update: 2019-09-04 15:50 GMT
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ... ప్రస్తుతం రష్యాలో ఉన్న సంగతి తెలిసిందే కదా. రష్యాలో పర్యటిస్తున్న మోదీ... ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరు దేశాలకు చెందిన నేతలు పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై వారిద్దరి చర్చల ఫలితంగా ఇరు దేశాల మధ్య ఏకంగా 25 కొత్త ఒప్పందాలు కుదిరాయి. అంతేకాకుండా రష్యాకు చెన్నై నుంచి నేరుగా సముద్ర రవాణాకు కూడా మార్గం సుగమం అయ్యే దిశగా కీలక నిర్ణయం జరిగిపోయింది. ఈ మేరకు ఇరు దేశాల నేతలు... భేటీ ముగిశాక సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించారు.

ఇప్పటికే భారత్ లో అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి తోడ్పాటు అందిస్తున్న రష్యా... మరో 20 అణు విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. రష్యాలోని చారిత్రక నగరం వ్లాదివోస్తాక్ నుంచి నేరుగా చెన్నైకి సముద్ర రవాణా మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ మార్గం కార్యరూపం దాలిస్తే.... భారత్ నుంచి రష్యాకు - రష్యా నుంచి భారత్ కు సరుకు రవాణా మరింత సులభతరం అవుతుంది. ఈ సముద్ర మార్గాన్ని ఏదో తాత్కాలికంగా కాకుండా శాశ్వత ప్రాతిపదికననే ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

ఇక రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని మోదీకి ప్రకటించిన పుతిన్... అదే విషయాన్ని మోదీకి నేరుగా చెప్పారు. ఈ పురస్కారంపై మోదీ తనదైన శైలిలో స్పందించారు. రష్యా అత్యున్నత పురస్కారం తనకు మాత్రమే కాకుండా భారత్ లోని 130 కోట్ల మందికి దక్కిన గౌరవంగా భావిస్తానని మోదీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే... మాస్సో మహా యద్ధంలో రష్యా విజయం సాధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా వ్లాదివోస్తాక్ లో వచ్చే ఏడాది భారీ విజయోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పిన పుతిన్... ఆ వేడుకలకు మోదీని ముఖ్య అతిథిగా హాజరు కావాలంటూ ఆహ్వానించారు. అందుకు మోదీ కూడా అక్కడికక్కడే సరనన్నారు. ఈ వేడుకలకు హాజరు కావడం ద్వారా... రష్యా రాజధాని కాకుండా ఆ దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా మోదీ రికార్డు పుటలకు ఎక్కనున్నారు.

   

Tags:    

Similar News