అశోక్...ఎక్కడా తగ్గదిలే ...?

Update: 2021-12-23 10:32 GMT
విజయనగరం జిల్లాకు చెందిన పూసపాటి వారసుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఎక్కడా తగ్గడంలేదు. వైసీపీఓ ఢీ కొడతాను అంటున్నారు. ఈ విషయంలో తాను ఎందాకైనా అని మరీ గట్టిగానే చెబుతున్నారు. ఒక విధంగా ఆయన వైసీపీ సర్కార్ని చెడుగుడు ఆడిస్తున్నారు. రామతీర్ధంలో తాజాగా జరిగిన ఘటన మీద ఆయన ప్రభుత్వానిదే ముమ్మాటికీ తప్పు అన్నారు. ప్రభుత్వం హిందూ ధర్మం, ఆచారాలు, పద్ధతుల విషయంలో సరిగ్గా వ్యవహరించలేదు అని ఆయన నిందించారు.

రామతీర్ధంలో అశోక్ వర్సెస్ వైసీపీ మంత్రులుగా సాగుతున్న ఎపిసోడ్ లో వేడి ఇంకా చల్లారలేదు సరికదా ఇంకా పీక్స్ కి వ్యవ‌హారం చేరుకుంటోంది. రామతీర్ధంలో శంకుస్థాపన అడ్డుకున్నారని అశోక్ మీద పోలీస్ కేసుని ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదుతో పెట్టారు. దీంతో మరింత ఆగ్రహించిన అశోక్ ఏకంగా మీడియా ముందే ప్రభుత్వ తీరుని పూర్తిగా తూర్పారా పట్టారు.

ఈ ప్రభుత్వం నన్నుఏరి కోరి మరీ టార్గెట్ చేసిందని ఆయన ఆరోపించారు. అంతే కాదు, ఆలయ అనువంశిక ధర్మకర్తలు ఉండడం కూడా పాలకులకు ఇష్టం లేనట్లుగా ఉందని ఫైర్ అయ్యారు. ఆలయాలకు ఆచారాలు, విధానాలు ఉంటాయి తప్ప ప్రోటోకాల్ ఎక్కడా ఉండదని ఆయన అన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అన్నింటినీ పక్కన పెట్టేసిందని ఆయన వాపోయారు.

తాను రామతీర్ధం అనువంశిక ధర్మకర్తగా ఉంటే ఆఖరు నిముషంలో తనను పిలిచారని, ఆయినా సరే తన చేత కొబ్బరికాయ కొట్టనీయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని అశోక్ చెప్పారు. ఆలయంలో పూజల కోసం వైసీపీ పెద్దలు షూస్ వేసుకువచ్చారని ఆయన మండిపడ్డారు. భక్తుల డబ్బుతో పెత్తనం చేస్తున్న ప్రభుత్వానికి ధర్మకర్తలను కూడా గౌరవించడం డం ఎలాగో తెలియదని ఆయన విమర్శించారు.

ఇక దేవాదాయ శాఖకు కామన్ గుడ్ ఫండ్స్ గా భక్తులు ఇచ్చే డబ్బు ఉంటుందని, దానికి మళ్ళించే అధికారం ప్రభుత్వానికి లేదని, అయనా వాహనమిత్రకు ఆ సొమ్ముని వైసీపీ సర్కార్ పెద్దలు మళ్లించారని ఆయన ఆరోపించారు. అనువంశిక ధర్మకర్తలను ప్రభుత్వాలు నియమించలేవు అని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 230 మంది దాకా అనువంశిక ధర్మకర్తలు ఉన్నారని ఆయన అన్నారు. వారే దేవుడికి సంబంధిచ్నిన కార్యక్ర‌మాలను ఆచార వ్యవహరాలను చూస్తారని అశోక్ గుర్తు చేశారు. అలాంటి వ్యవస్థను ఇబ్బంది పెడుతున్నారని అశోక్ వాపోయారు.

ఇక తన మీద కేసులు పెట్టడం టార్గెట్ చేయడమే ప్రభుత్వానికి పనిగా ఉందని అన్నారు. పైగా ఈవోల చేత కేసులు పెట్టించడం కొత్త సంప్రదాయామని ఆయన అన్నారు. ఎవరెన్ని చేసినా కూడా తాను మాత్రం భయపడేది అసలు లేదని, హిందూ ధర్మం కోసం పాటుపడతానని, తన కొన ఊపిరి ఉన్నంతవరకూ పొరాడుతూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా . రామతీర్ధంలో ఎపిసోడ్ వెనక బాబు ఉన్నారన్న దాన్ని అశోక్ పూర్తిగా తప్పుపట్టారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు చేయడానికి తాను ఏమైనా ఆయనకు పీఏనా అంటూ అశోక్ చేసిన కామెంట్ అయితే వైరల్ అవుతోంది. నిజానికి అశోక్ ఉద్దేశ్యం వేరు, ఆయన టీడీపీ కీలక నేతగా కాదు, ఆలయ ధర్మకర్తగా రామతీర్ధానికి వెళ్లారు, అయితే ఆయన వెనక బాబు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తూండడంతో అశోక్ ఇలా హాట్ గా రియాక్ట్ అయ్యారని చెబుతున్నారు. అయితే ఈ ఎపిసోడ్ లో చంద్రబాబుని మధ్యన లాగడం మంచిది కాదని కూడా అశోక్ అంటున్నారు. మొత్తానికి అశోక్ ఎక్కడా తగ్గేది లే అంటూ దూసుకువస్తున్న తీరుతో ప్రభుత్వ పెద్దలకు ఇరకాటమే అవుతోంది.


Tags:    

Similar News