అన్నవరం టూ భీమవరం : వారాహితో పవన్ వేరే లెవెల్లో...!

Update: 2023-06-02 22:29 GMT
పవన్ కళ్యాణ్ మొత్తానికి వారాహి రధంలో జనంలోకి వచ్చేస్తున్నారు. జూన్ నెలలో తాను జనంలోకి వస్తానని ఇటీవల మంగళగిరిలో జరిగిన పార్టీ సమావేశంలో పవన్ చెప్పారు. అన్న మాట ప్రకారం ఆయన జూన్ నుంచి వారాహి రధమెక్కి ప్రజల కోసం వస్తున్నారు. జూన్ 14 నుంచి పవన్ వారాహి యాత్ర స్టార్ట్ కాబోతోంది.

అన్నవరాంలో ఆ రోజు వారాహి రధాన్ని ఉంచి స్వామికి ప్రత్యేక పూజలు చేయించిన తరువాత పవన్ యాత్ర మొదలవుతుంది. వారాహి రధం మీద నుంచి పవన్ తొలి మీటింగ్ కత్తిపూడి జంక్షన్ లో ఉంటుందని పార్టీ వర్గాలు తెలియచేశాయి.

ఈ సభలో జగన్ సర్కార్ మీద పవన్ నిప్పులే కురిపిస్తారు అని అంటున్నారు. వైసీపీ పాలన ఏపీలో ఎందుకు ఉండకూడదో ఆయన జనాలకు వివరించడం ద్వారా వారిని వైసీపీని ఓడించమని పిలుపు ఇస్తారని అంటున్నారు. నాలుగేళ్ళ వైసీపీ పాలనలోంకి వైఫల్యాలు అభివృద్ధి లేమి ఏపీకి జరిగిన నష్టాలు కష్టాలు అన్నీ పవన్ ఏకరువు పెడతారు అని  చెబుతున్నారు.

అన్నవరం నుంచి భీమవరం దకా ఎక్కడా విరామం లేకుండా పవన్ వారాహి రధయాత్ర సాగుతుంది అని అంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఆమూలాగ్రం పవన్ తిరుగుతారని, అన్ని వర్గాల ప్రజలతో ఆయమ మమేకం అవుతారని అంటున్నారు. తొలి విడత టూర్ లో మొత్తం పదకొండు నియోజకవర్గాలను పవన్ కవర్ చేస్తారు అని అంటున్నారు.

అలా చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజకవర్గంతో మొదలుపెట్టి, పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర ఉంటుంది.

ఈ టూర్ ముగిసిన తరువాత పశ్చిమ నియోజకవర్గంలోని మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలలో పవన్ టూర్ ఉంటుందని అంటున్నారు. పశ్చిమ గోదావరి రూట్ మ్యాప్ ని దీని తరువాత ఖరారు చేస్తారు. పవన్ వారాహి రధయాత్ర ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Similar News