1570 క్యాండిడేట్స్ పై ఈసీ అనర్హత

Update: 2019-04-24 10:47 GMT
తెలంగాణ ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 1570మంది క్యాండిడేట్స్ ను ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హత వేటు వేసింది. ఈ నిర్ణయంతో వీరు ఇప్పుడు తెలంగాణలో జరిగే పరిషత్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయకుండా పోయారు. వీరంతా గడిచిన ఎన్నికల్లో పోటీచేసి ఎన్నికల ఖర్చును చూపించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 291మంది అభ్యర్థులు జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడింది. ఇక 1279మంది ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీపడకుండా అనర్హత వేటు వేశారు. గత ఎన్నికల్లో పోలింగ్ తర్వాత ఇచ్చిన గడువు 45 రోజుల్లో వీరంతా ఎన్నికల్లో ఖర్చు చూపించలేదని.. అందుకే వీరు మరోసారి పోటీచేయకుండా అనర్హత వేటు వేశామని ఎన్నికల కమిషన్ ప్రకటనలో తెలిపింది.

ప్రతి ఎన్నికల్లోనూ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు ఓడినా.. గెలిచినా జిల్లా కలెక్టర్  మరియు ఎన్నికల కమిషన్ కు తాము ఎన్నికల్లో చేసిన ఖర్చు నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. అవి చేయకపోవడంతో వచ్చే ఎన్నికల్లో అనర్హతవేటుకు గురి అవుతుంటారు.

ఈ దఫా పరిషత్ ఎన్నికల్లో తెలంగాణ ఎన్నికల కమిషన్ ఖర్చు పరిమితిని రెట్టింపు చేసింది. ఈ ఎన్నికల్లో జడ్పీటీసీకి పోటీచేసే అభ్యర్థులు 4 లక్షల వరకు , ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.5 లక్షల వరకూ ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించింది. గడిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఈ మొత్తం జడ్పీటీసీలకు 1.5లక్షలు ఉండగా.. ఎంపీటీసీల ఖర్చు పరిమితి కేవలం 60వేల ఉండడం గమనార్హం.



Tags:    

Similar News