ఎన్నికల వేళ.. యూపీలో 'నోటు' రాజకీయాల ఘాటు

Update: 2021-12-24 09:31 GMT
వచ్చే ఫిబ్రవరిలోనో, మార్చిలోనో.. ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక చూపు నిలిపి ప్రగతి పనులు ప్రారంభిస్తున్నారు. సీఎం యోగి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇటీవలే యూపీలో లవ్ జిహాద్ కింద ఓ యువతిని పెళ్లి చేసుకుని మోసం చేసిన ఓ యువకుడికి శిక్ష కూడా పడింది. మరోవైపు సమాజ్ వాదీ పార్టీకి చెందిన నాయకుల ఇళ్లలో వరుసగా ఆదాయ పన్ను అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. సమాజ్ వాదీ చీఫ్, విద్యా సంస్థల అధినేత నివాసంలోనూ తనిఖీలు జరిగాయి.

ఇది రాజకీయంగానూ దుమారం రేపుతోంది. బీజేపీ, ఎస్పీ విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. తాజాగా పన్ను ఎగవేత ఆరోపణలపై ఓ వ్యాపారి ఇంట్లో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులకు నోట్ల గుట్టలు కన్పించాయి. వాటిని లెక్కించగా.. రూ.150 కోట్లకు పైనే తేలింది.

కాన్పూర్‌కు చెందిన సుగంధ ద్రవ్యాల తయారీ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ సంస్థ యజమాని పీయూష్‌ జైన్‌ ఇంటికి గురువారం ఉదయం ఐటీ అధికారులు వెళ్లారు. రెండు అల్మారాలను తెరిచి చూడగా.. వాటి నిండా నోట్ల కట్టలు కన్పించాయి. అవన్నీ శుభ్రంగా ప్యాకింగ్ చేసి ఉన్నాయి.

12 గంటలు... 150 కోట్లు పైనే..

బ్యాంక్‌ అధికారులను పిలిపించి లెక్కించగా 12 గంటలు పైనే పట్టింది. నిన్న సాయంత్రం మొదలైన లెక్కింపు ఈ రోజు ఉదయ వరకు కొనసాగింది. ఈ మొత్తం విలువ చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. రూ.150కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా లెక్కింపు కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న జీఎస్‌టీ అధికారులు కూడా ఆయన నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

నకిలీ ఇన్‌వాయిస్‌లు, ఈవే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరకుకు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. పత్రాల్లో లేని కంపెనీల ద్వారా నకిలీ ఇన్‌వాయిస్‌లను సృష్టించి జీఎస్‌టీ, పన్ను చెల్లింపులు ఎగ్గొట్టినట్లు దర్యాప్తులో తేలింది. మహారాష్ట్ర, గుజరాత్‌లోని పీయూష్ కార్యాలయాలు, గోదాముల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి. ఓ గోదాంలో 200 నకిలీ ఇన్‌వాయిస్‌లు ఉన్న నాలుగు ట్రక్కులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇది ఎస్పీ అవినీతి వాసన

పీయూష్‌ సమాజ్‌వాదీ పార్టీ లీడర్. అఖిలేష్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల ‘‘సమాజ్‌వాదీ’’పేరుతో పీయూష్‌ ఓ ప్రత్యేక సెంటును కూడా విడుదల చేశారు. దీంతో ఎస్పీపై భాజపా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. నోట్ల కట్టల ఫొటోలను ట్వీట్ చేస్తూ.. ‘ఎస్పీ అవినీతి వాసన’ ఇది అంటూ దుయ్యబట్టింది.




Tags:    

Similar News