డొక్కా..దారి డిసైడ‌యింది

Update: 2015-08-30 07:49 GMT
డొక్కా మాణిక్యవరప్రసాద్. రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. దివంగ‌త సీఎం వైఎస్ఆర్, మాజీ ముఖ్య‌మంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ ల‌లో అమాత్యపదవిని పొందారు. ఏపీ కాంగ్రెస్ సీనియర్లలో ఒకరు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం లేకపోవడంతో..తెరమరుగైన డొక్కా క్రియాశీల రాజ‌కీయాల్లోకి వచ్చేందుకు ప్ర‌యత్నాలు ప్రారంభించారు.

విభజనతో ఏపీలో కాంగ్రెస్ ఏకాకి కావడంతో...డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజకీయ భవిష్యత్తు దాదాపు కనుమరుగైంది. కొంతకాలం క్రితం...డొక్కా వైసీపీలో చేరాలని ప్ర‌యత్నించారు. ఈ విషయం గమనించిన టీడీపీ అలర్ట్ అయ్యింది. డొక్కా వైసీపీలో చేరకుండా మాస్టర్ స్కెచ్ గీసింది. గురువు, ఎంపీ అయిన రాయపాటి సాంబశివరావును రంగంలోకి దించి డొక్కాను తన దరికి చేర్చుకుంటుంది టీడీపీ.

గత ఎన్నికలకు ముందే రాయపాటితో పాటు టీడీపీ చేరాలని భావించారు డొక్కా మాణిక్యవరప్రసాద్. అయితే టికెట్ గ్యారెంటీ లేక చేరలేదు. దీంతో ఎన్నికలయిన వెంటనే సైకిల్ ఎక్కేందుకు యత్నించారు. కానీ అప్పుడు జిల్లా మంత్రి రావెల కిషోర్ బాబు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వైసీపీలో చేరాలని భావించారు. జగన్ కూడా చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే డొక్కా వైసీపీలో చేరితే అమరావతిలో మళ్లీ వైసీపీకి ప్రాణం పోసినట్లవుతుందని టీడీపీ భయపడింది.

రాజధాని ప్రాంతంలో 60 వేల మంది రైతుకూలీలకు న్యాయం జరగట్లేదని డొక్కా హెచ్చరించేవారు. వారికోసం ఉద్యమిస్తానని చెప్పేవారు. దీంతో లోకేష్‌ ను రంగంలోకి దించింది. డొక్కాతో మాట్లేడేందుకు లోకేష్ యత్నించారు. నేరుగా మాట్లాడే అవకాశం కుదరకపోవడంతో...రాయపాటిని రంగంలోకి దించారు. రాజకీయాల్లో గురువు అయిన రాయపాటి మాటను కాదనలేక టీడీపీలో చేరేందుకు సిద్దపడ్డారు మాణిక్యవరప్రసాద్.
Tags:    

Similar News