తెలుగు మీడియా సంస్థలకు ఆ సత్తా లేదా?

Update: 2020-12-05 04:05 GMT
దేశంలోని ఏ ప్రాంతీయ మీడియా సంస్థలకు లేని విశిష్ఠతలు ఎన్నో తెలుగు మీడియా సొంతమని పలు సందర్భాల్లో మీడియా ప్రముఖల నోట వినిపిస్తూ ఉంటుంది. మీడియా రంగంలో చోటు చేసుకునే ఎన్నో ప్రయోగాలు తెలుగు మీడియానే షురూ చేసినట్లు చెబుతారు. ఇక.. తెలుగులోనే కాదు.. దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లోనూ న్యూస్ అందించే నెట్ వర్కు ఉన్న మీడియా సంస్థలు మన దగ్గర ఉన్నాయి. కానీ.. అవేమీ కూడా కీలకమైన ఎన్నికల వేళ.. ఎగ్జిట్ పోల్స్ చేయటానికి ఎందుకు ప్రయత్నించవు? అన్నది ఆసక్తికరమైన ప్రశ్న.

తోపులమని తమకు తామే చెప్పుకోవటంతో పాటు.. ప్రజల మనసుల్ని తరచూ తాము తెలుసుకుంటామని విశ్లేషణలు చేసే మీడియా సంస్థలు తెలుగునేల మీద.. అందునా హైదరాబాద్ లో బోలెడన్ని ఉన్నాయి. అవేమీ కూడా.. ఎన్నికలకు సంబంధించిన సర్వేలు.. ఎగ్జిట్ పోల్స్ ను ఎందుకు నిర్వహించవు అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలతో పాటు.. షాకింగ్ నిజాలు బయటకు వస్తాయి.

గతంలో  తెలుగు మీడియా సంస్థలు కీలకమైన ఎన్నికల వేళ.. సర్వేలు చేయించేవారు. అయితే.. వాటి సక్సెస్ రేట్ తక్కువగా ఉండటం.. సర్వేలను వెల్లడించిన వెంటనే వాటికి ఏదో ఒక రాజకీయ రంగు పులవటం జరిగిపోతోంది. దీనికితోడు.. సర్వే అంచనాలు చాలావరకు ఫెయిల్ కావటం.. దీంతో సదరు మీడియా సంస్థ ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. అన్నింటికి మించి.. శాస్త్రీయంగా సర్వే నిర్వహించటానికి అయ్యే ఖర్చును పెట్టుకోవటానికి తెలుగు మీడియాకు చెందిన ప్రముఖ సంస్థలు ఇష్టపడటం లేదు.

అదో ఖర్చు అవసరమా? అన్న మాటను బోర్డు మీటింగ్ లో ఓపెన్ గా మాట్లాడేసుకోవటం కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారన్న విషయాన్ని రెండు.. మూడు రోజులు లేదంటే పది రోజుల తర్వాత అయినా తెలిసేదే. అంత మాత్రానికి ముందే చెప్పి.. లేనిపోని ఇబ్బందుల్ని తెచ్చి పెట్టుకునే కంటే.. మౌనంగా ఉంటూ.. ఆ సంస్థ ఇలా చెప్పింది..ఈ సంస్థ ఇలా చెప్పిందన్న మాటను చెబితే సరిపోతుందన్న సేఫ్ గేమ్ ప్లాన్ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ప్రజల మనసుల్ని.. వారి ఆలోచనల్ని గుర్తించేందుకు చేసే కష్టాన్ని.. శ్రమను.. ఖర్చుతో చూసే అంశమే.. సర్వేలకు దూరంగా ఉంచుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News