వ్యాక్సిన్ తీసుకున్నాక మంత్రికి కరోనా పాజిటివ్ !

Update: 2020-12-05 08:31 GMT
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్  'కోవాక్సీన్' ను హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ నవంబర్‌ 20న తీసుకున్న సంగతి  తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ మూడో దశ ట్రయల్స్‌ లో భాగంగా అనిల్‌ వ్యాక్సిన్ ను తీసుకున్నారు. అయినప్పటికీ ఆయన తాజాగా కరోనా బారిన పడటం వ్యాక్సిన్‌ విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తనకు కరోనా వైరస్ సోకిందని ఆయనే ట్వీట్ చేశారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారు టెస్ట్ చేసుకోవాలని సూచించారు. తాను ప్రస్తుతం అంబాలాలో గల సివిల్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నానని వివరించారు. అయితే అదే ఆస్పత్రిలో కరోనా వైరస్ కోసం గతనెల 20వ తేదీన టీకా తీసుకోవడం విశేషం. కరోనా వైరస్ వ్యాక్సిన్ మూడో దశలో చాలా మంది వాలంటీర్స్ టీకా తీసుకున్నారు. ఎక్కువ మంది యువతే ఉన్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వైరస్ రావడం కలకలం రేపింది. కోవాక్సిన్ టీకాను భారత్ బయోటెక్,  ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కలిసి అభివృద్ధి చేశాయి. ఇదివరకు ఫేజ్ 1, ఫేజ్ 2 సమర్థవంతంగా పూర్తిచేశామని కంపెనీ తెలిపింది. అయితే మూడో దశలో ఏకంగా మంత్రికే వైరస్ సోకడంతో దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. డ్రగ్ కంట్రోల్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా  అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మూడోదశ ట్రయల్స్‌లో మొదటి వాలంటీర్‌గా విజ్ ముందుకొచ్చారు.
Tags:    

Similar News