ప‌రువు హ‌త్య పై కాంగ్రెస్ స్టాండ్ ఏంటో ? రాములా ! రాహులా !

Update: 2022-05-08 03:38 GMT
బాధితురాలికి న్యాయం చేయండి.. ఆమె మైనార్టీ వ‌ర్గానికి చెందిన వారు.. ఆమెకు ముఖ్యంగా అండ‌గా ఉండి., ఆమె ప్రేమ‌ను అర్థం చేసుకుని  బాధిత కుటుంబానికి న్యాయం చేయండి. అంటే నాగ‌రాజు కుటుంబానికి అండ‌గా ఉండి మాట్లాడ‌డంలో సామాజిక స్పృహ‌తో పాటు చైత‌న్యం కూడా దాగి ఉంది. చైత‌న్య వంతం అయిన స‌మాజంలో మాత్ర‌మే ప‌రువు హత్య‌ల‌న్న‌వి జ‌ర‌గ‌వు. చైత‌న్య వంతం అయిన స‌మాజంలో మాత్రమే మంచి మార్పులు అన్న‌వి సిద్ధిస్తాయి. తెలంగాణ నేల చైత‌న్యం నిండి నేల.. కానీ నాయ‌కులే ఆ చైత‌న్యాన్ని త‌మ‌కు అనుగుణంగా మార్చుకుని ఓట్ల రూపాన మార్చుకుని వృద్ధి సాధిస్తున్నారు. అనూహ్య రీతిలో ఆర్థిక వృద్ధి సాధించి, త‌మ జీవితాల‌ను ఆనందమ‌యం చేసుకుని, తోటి వారి విషాదాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇందుకు ఆ పార్టీ, ఈ పార్టీ అన్న మిన‌హాయింపే లేదు.. కాళ్లు ప‌ట్టుకున్నా క‌నిక‌రించ‌లేదు అన్న ఆ ఒక్క బాధిత స్వ‌రం.. మిమ్మ‌ల్ని ఎందుకు క‌దిలించ‌లేదు రాహుల్.. మిమ్మ‌ల్ని ఎందుకు క‌ద‌లించ‌డం లేదు కేటీఆర్.. మీరంతా ఈ ఘ‌ట‌న‌కు సంబంధిత బాధ్య‌త వ‌హించి ఆమెకు ఎందుక‌ని న్యాయం చేయ‌లేక‌పోతున్నారు అని ప్ర‌శ్నిస్తోంది పౌర స‌మాజం. వింటున్నారా రాహుల్ .. వింటున్నారా రేవంత్.. వింటున్నారా కేటీఆర్.. మీరు మాట్లాడితేనే స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తాయి.. మీరు పోరాడితే మ‌రిన్ని స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

హైద్రాబాద్, సరూర్ న‌గ‌ర్ లో జ‌రిగిన ప‌రువు హ‌త్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నే కాదు దేశ వ్యాప్తంగానూ సంచ‌ల‌నం అయింది.

ఆ విధంగా సెన్సేష‌న్ అయింది. ఘ‌ట‌న‌లో బాధితులు అటు ద‌ళితులు ఇటు మైనార్టీ వ‌ర్గానికి చెందిన మ‌గువ. వీరి విష‌య‌మై మాట్లాడాల్సింది ఎవ‌రు? ప్రాణం పోయిన  నాగ‌రాజును తీసుకురాలేం కానీ ప్రాణాల‌తో ఉన్న అశ్రిన్ కు అండ‌గా ఉండాల్సిందే ! ఆమెకు న్యాయం జ‌రిగేంత వ‌ర‌కూ పోరాడాల్సిందే..! నిందితుల‌కు క‌ఠిన శిక్ష‌లు ప‌డాల్సిందే ! కానీ పోరాడేది ఎవ‌రు ? ఎవ‌రి స్వార్థం వారిది.. అన‌ర్థ దాయ‌క స్వార్థం ఇది అని అన్నారు క‌దా శ్రీ‌శ్రీ‌. ఆ విధంగా అన‌ర్థ దాయ‌క స్వార్థంలో భాగంగానే రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. పార్టీలూ న‌డుస్తున్నాయి. ఫ‌లితంగా ఎవ‌రికి వారు య‌మునా తీరే ! ఇప్పుడు నాయ‌కుల హామీలు నీటి మీద రాతలు. ఇక ఆ అమ్మాయికి న్యాయం ఎవ‌రు చేస్తారు.

బాధ్య‌త గ‌ల పార్టీలు బాధ్య‌త గ‌ల విష‌యాల‌పై స్పందించాలి. కానీ స్పందించ‌డం లేదు. బాధ్య‌త గ‌ల నాయ‌కులు ఓటు బ్యాంకు రాజ‌కీయాలు అటుంచి మాట్లాడితే మేలు. సైద్ధాంతికత అన్న‌ది ఒక‌టి ఉంటుంది.. దాంతో పాటు సైద్ధాంతిక నైతిక‌త అన్న‌ది కూడా ఉంటుంది. వీటిని ప‌రిగ‌ణ‌న‌లో ఉంచుకుని అయినా రాజ‌కీయ పార్టీలు బాధిత మ‌హిళ విష‌య‌మై రోడ్డెక్కాలి. కాంగ్రెస్ మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆ పార్టీ పొలిటిక‌ల్ మైలేజీ వ‌స్తుందా రాదా అని ఆలోచిస్తుంద‌ని చాలా మంది సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు, ద‌ళిత సంఘాల నేత‌లు వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్ మాట్లాడాలి కానీ మాట్లాడ‌లేదు. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు అన్న వాద‌న ఒక‌టి వినిపిస్తోంది ఇదే స‌మ‌యాన.
Tags:    

Similar News