అమరావతికి సర్క్యులర్ రైలు

Update: 2015-11-19 11:18 GMT
నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతికి మెట్రో రైలు వచ్చే వరకూ ప్రత్యామ్నాయంగా సర్క్యులర్ రైలును నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. గుంటూరు - అమరావతి - విజయవాడ మధ్య వీటిని నడపాలని యోచిస్తోంది. ఈ మేరకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కేంద్ర రైల్వే బోర్డుకు ప్రతిపాదించారు. ఇందుకు బోర్డు సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలన్నీ వచ్చే ఏడాది జూన్ లోపు రాజధానికి తరలి రానున్నాయి. విజయవాడ - గుంటూరు - మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. దాదాపు లక్ష మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు రాజధానికి ప్రాంతానికి తరలి వస్తే వారికి రవాణా సౌకర్యాలకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం అయితే ఇక్కడ పని చేయడానికి వచ్చే అధికారులు, కూలీలతో రవాణా వ్యవస్థలపై మరింత భారం పడుతుంది. రాజధానిలో జన సాంధ్రత పెరిగే వరకూ మెట్రో రైలును నడపడం సాధ్యం కాదు. అది మరో నాలుగైదేళ్ల వరకూ సాకారం అయ్యే అవకాశాలూ లేవు.

ఈ నేపథ్యంలోనే విజయవాడ - గుంటూరు - అమరావతి మధ్య సర్క్యులర్ రైళ్లను నడపాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రతిపాదించారు. రైల్వే బోర్డుకు ప్రతిపాదించారు. త్వరలో జరగనున్న రైల్వే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు నిర్ణయం తీసుకుంటే రాబోయే రైల్వే బడ్జెట్ లో దీనిని పెట్టే అవకాశం ఉందని సమాచారం. బడ్జెట్ లో కనక దీనికి నిధులు కేటాయిస్తే యుద్ధ ప్రాతిపదికన దీనిని పూర్తి చేయాలని కూడా భావిస్తున్నారు.
Tags:    

Similar News