మార్గదర్శి కేసు : రామోజీరావు ఆస్తులను అటాచ్ చేసిన సీఐడీ

Update: 2023-05-29 22:27 GMT
మీడియా మొఘల్,  దేశంలో ప్రముఖ వ్యాపార దిగ్గజం అయిన ఈనాడు రామోజీరావు ఆస్తులను ఏపీ సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శి కేసుకు సంబంధించి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.  మార్గదర్శి కేసుని గత కొంతకాలంగా విచారిస్తున్న ఏపీ సీఐడి సోమవారం సడెన్ గా అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది.

దీంతో ఇది ఎపీలో కలకలం రేపే విషయంగా మారింది. రామోజీరావుకు సంబంధించి 793 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీఐడీ అటాచ్ చేసింది. మార్గదర్శిలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, ఫోర్ మెన్, ఆడిటర్ లు కుట్రతో  నేరానికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ పేర్కొంది.

అదే విధంగా నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శిని నడుపుతున్నారని వెల్లడించారు. మార్గదర్శి నుంచి సేకరించిన సొమ్మును హైదరాబాద్ లో ఉన్న కార్పోరేట్ ఆఫీస్ ద్వారా మ్యూచ్ వల్  ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారని తెలిపింది. ఈ విధంగా ఖాతాదారుల సొమ్ముని వేరే చోట పెట్టడం చిట్ ఫండ్ చట్టానికి పూర్తి విరుద్ధమని వివరించింది.

ఏపీలో చూసుకుంటే 37 శాఖల ద్వారా మార్గదర్శి వ్యాపారం చేస్తోందని  అదే విధంగా ఏపీలో మార్గదర్శికి సంబంధించి  1989 చిట్స్ గ్రూపులు ఉన్నాయని వెల్లడించింది. ఇక మార్గదర్శిలో ఖాతాదారులకు అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చే పరిస్థితిలో సంస్థ లేదని కూడా స్పష్టం చేసింది.

ఈ కారణాలతో రామోజీరావుకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తున్నామని తెలిపింది. మార్గదర్శి కేసులో ఇది చాలా కీలకమైన పరిణామంగానే అంతా చూస్తున్నారు. ఇప్పటిదాకా మార్గదర్శి విషయంలో పెద్దగా ఎవరూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఇపుడు దూకుడు గా ఏపీ సీఐడీ అధికారులు గత కొంతకాలంగా దర్యాప్తుని చేస్తున్నారు.

అదే టైం లో కేసులు కూడా ఎక్కిడికక్కడ నమోదు చేస్తున్నారు. ఇక జూన్ నెల కీలకంగా మారే అవకాశం ఉంది అంటున్నారు. సుప్రీం కోర్టులో మార్గదర్శి మీద మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన కేసులో ఖాతాదారులకు చెల్లించిన మొత్తం సొమ్ము వివరాలను వెల్లడించాలని సుప్రీం ఆదేశించింది. దాంతో ఈ కేసులో కీలకమైన పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఏది ఏమైనా మార్గదర్శి చరిత్రలో ఇది అత్యంత సంచలన పరిణామంగానే  చూస్తున్నారు.

Similar News