నాటుకోడి.. బ్రాయిలర్ కోడి.. చంద్రన్న కోడి

Update: 2016-10-24 11:24 GMT
కోడి ఏ రంగులో ఉంటుంది....? నాటు కోళ్లయితే నల్లరంగు - కొన్ని గోధుమ వర్ణం - ఇంకొన్ని రెండు మూడు రంగులు కలిసి ఉంటాయి.. బ్రాయిలర్ అయితే తెల్లగా తళతళలాడిపోతుంది. కానీ.. ఇకపై ఏపీలో పచ్చ కోళ్లు కనబడబోతున్నాయట. ఊళ్లన్నీ కోళ్ల గూళ్లవబోతున్నాయట. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పథకం దెబ్బకు మరికొన్నాళ్లకు రాష్ట్రమంతా కొక్కొరొక్కో కూతలే వినబడబోతున్నాయి. అవును... చంద్రబాబు ప్రభుత్వం ‘చంద్రన్న కోడి’ పేరుతో మహిళలను కోళ్ల పెంపకందార్లుగా మార్చబోతోంది. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం త్వరలోనే ఈ చంద్రన్న కోడి పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఒక్కో కోడి పిల్ల ధరను ఏకంగా రూ. 68 గా నిర్ణయించారు. ఒక్కో మహిళకు 45 కోడి పిల్లలను ఇస్తారు. ఇందుకు ఒక్కో యూనిట్‌ కు రూ. 3060 ఖర్చు అవుతుంది. 2250 రూపాయలను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తుంది. కోళ్లను ఎలా పెంచాలన్న దానిపై మహిళలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. నాటు కోళ్లు 80 శాతం వ్యాధులను తట్టుకోగలవు కాబట్టి పెద్దగా ఇబ్బంది కూడా ఉండదని చెబుతున్నారు. గిరిజనులకు మాత్రం ఈ కోడి పిల్లలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందట.

తొలుత ఈ పథకానికి మనకోడి అన్న పేరు అనుకున్నా కూడా చివరకు చంద్రన్న కోడిగా నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఆరు మాసాల్లో ఇవి ఒక్కొక్కటి రెండున్నర నుంచి మూడు కేజీల బరువు పెరుగుతాయని.. వీటిని అమ్ముకోవడం ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచుకోవచ్చని.. వీటి గుడ్ల విక్రయం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే.. కోడి పిల్లలను గద్దలు తన్నుకుపోతే ఈ లెక్కలేమవుతాయో అధికారులు అంచనా వేశారో లేదో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News