ఏపీ సీఎస్ రిటైర్డ్‌...కులం కోణంలోనే కొత్త సీఎస్

Update: 2017-02-27 10:31 GMT
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్‌ పీ ఠక్కర్‌ పదవీ కాలం రేపటితో ముగియనుంది.  ఆయనకు ఇప్పటికే ఆరునెలలు పొడిగింపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కొత్త సిఎస్‌ ఎంపికపై నేడు ఉత్తర్వులు జారీ కానున్నాయి. ప్రధాన కార్యదర్శి పదవీ విరమణ చేసిన అనంత‌రం ఠ‌క్క‌ర్‌ను  ప్రతిష్ఠాత్మకమైన ఎకనమిక్ డెవలెప్‌ మెంట్ బోర్డుకు ఉపాధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బోర్డుకు ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అమరావతి అభివృద్ధి - విదేశీ సంస్థల నిధులు - కంపెనీల పెట్టుబడులు దృష్టిలో ఉంచుకుని ఆయనకు ఆ పదవి ఇవ్వనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ - ఫైనాన్స్‌ విభాగం ముఖ్య కార్యదర్శి అజయ్‌ కల్లంను ప్రధాన కార్యదర్శిగా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. కానీ అజయ్‌ కల్లం వ‌చ్చే మార్చిలో రిటైర్‌ కానున్నారు. అజయ్‌ కల్లంను ప్రధాన కార్యదర్శి పదవికి ఎంపిక చేయకపోతే దినేశ్‌ కుమార్‌ - అనిల్‌ చంద్ర పునీతలలో ఒకరిని ఆ పదవికి ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది.

అయితే వివిధ స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం నియామకం దాదాపు ఖరారయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారికి పెద్దగా అవకాశం రానందున, ఆయనకు ఆ పదవి ఇవ్వడం ద్వారా సామాజిక సమీకరణను సమం చేయవచ్చన్న యోచన కూడా ప్రభుత్వ నిర్ణయంలో కనిపిస్తోందంటున్నారు. దీనికి సంబంధించి రెడ్డి వర్గానికి చెందిన టీడీపీ సీనియర్లతో బాబు చ‌ర్చించార‌ని చెప్తున్నారు. మ‌రోవైపు స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఉన్న అనిల్ చంద్ర పునేఠాకు ఈసారి కూడా నిరాశ తప్పేలా లేదు. ప్రస్తుత సమీకరణలు పరిశీలిస్తే ఒకవేళ అజ‌య్ క‌ల్లంకు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా అవకాశం క‌ల్పించి మార్చిలో ఆయ‌న గ‌డువు ముగిసిన త‌ర్వాత అదనంగా 6 నెలలు పొడిగింపు ఇవ్వ‌వ‌చ్చ‌ని అంటున్నారు. ఆ తర్వాతి అవకాశం కచ్చితంగా పరిపాలనా సంస్కరణల్లో విశేషానుభవం ఉన్న పునేఠాకు ఆ పదవి దక్కే అవకాశం ఉంద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News