బాబు చేసే ఆందోళన ఇప్పట్లో ఆగదంట!

Update: 2018-03-13 15:30 GMT
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏం ఆందోళన చేస్తున్నారో ఎవరైనా చెప్పగలరా? ఆగండాగండి.. పార్లమెంటులో తెలుగుదేశం ఎంపీలు కాసేపు సభలోను, కాసేపు సభ బయటా నిల్చుని ప్లకార్డులు పట్టుకుని హోదా ఇవ్వాల్సిందేనంటూ నినాదాలు చేస్తున్నారు.... ఈ ముక్క కాకుండా ఇంకేమైనా ఆందోళన జరుగుతున్నదా అనే సంగతి చెప్పగలవారెవరైనా ఉన్నారా? కష్టం. ఎందుకంటే.. తెలుగుదేశం తరఫున ప్రత్యేకమైన ఆందోళన అంటూ ఏమీ జరగడం లేదు. పన్లోపనిగా తమకు హోదా పోరాట యోధులుగా పేరు కీర్తి  వస్తుందని ఆశ ఉన్న కొందరు మాత్రం ఫ్లెక్సిలు వేయిస్తున్నారు అంతే.

మరైతే అలాంటప్పుడు, మాకు రావాల్సినవి అన్నీ  ఇచ్చేదాకా ఈ పోరాటం ఆపేదే లేదు.. అంట చంద్రబాబునాయుడు రెచ్చిపోయి మాట్లాడుతున్నది దేన్ని గురించో ప్రజలకు అర్థం కావడం లేదు. తెదేపా ఎంపీలు ఆపినా ఆపకపోయినా.. వారు చేసే ప్లకార్డుల పోరాటం అనేది.. ఏప్రిల్ 6తో ముగిసిపోతుంది. అప్పటిదాకా కూడా కేంద్రం పట్టించుకోకపోతే.. వారేం చేస్తారు? ఈ ఆందోళన ఆగదు అంటున్న చంద్రబాబు.. ఏ ఆందోళన గురించి మాట్లాడుతున్నారో.. అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

నిజానికి చంద్రబాబునాయుడు మంగళవారం నాడు అసెంబ్లీలో ఒక తీర్మానం ప్రతిపాదించి ఆమోదింపజేశారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి ఆ తీర్మానంలో నిరసన ప్రకటించారు. ఈ  నిరసన తీర్మానాన్ని ఢిల్లీకి పంపుతాం అని కూడా ఆయన హెచ్చరించారు.

కేంద్ర ప్రభుత్వంలోంచి మిత్రపక్షం మంత్రులు తప్పుకుంటేనే.. మోడీ సర్కారు ఖాతరు చేయలేదు. ఏపీ అసెంబ్లీ నిరసన ప్రకటిస్తూ తీర్మానం చేసినంత మాత్రాన భయపడిపోతుందా? అనేది ప్రజల మదిలో సందేహం. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు కుందేళ్లు బెదరవని ప్రజలు అంటున్నారు. నిజంగా కేంద్రంలో కదలిక తీసుకురావాలనే కోరిక చంద్రబాబునాయుడుకు ఉంటే గనుక.. ఇలాంటి చాటు మాటు చర్యలతో కాకుండా.. నిర్దిష్టమైన ప్రత్యక్షపోరాటానికి దిగాలని ప్రజలు సూచిస్తున్నారు.

అంటే.. రోడ్డెక్కి ఆందోళనలు చేయగలిగితే చాలా బాగుంటుందని.. కనీసం.. 21వ తేదీన వైకాపా ప్రతిపాదించబోయే అవిశ్వాస తీర్మానానికి అయినా మద్దతు తెలియజేసి.. చంద్రబాబు తన చిత్తశుద్ధి కాస్త చాటుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Tags:    

Similar News