క్లారిటీ ఇవ్వకపోతే సమస్యలే బాబూ..

Update: 2017-01-10 17:09 GMT
విమర్శలు.. ఆరోపణలు.. రాజకీయ నేత అయుష్షును తగ్గించేస్తుంటాయి. కాలం కలిసి వచ్చినంత కాలం ప్రత్యర్థులు ఎత్తి చూపే లోపాలతో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా.. ఒక్కసారి లెక్క తేడా వచ్చాక అవన్నీ వడ్డీతో సహా విరుచుకుపడతాయనటంలో సందేహం లేదు. అందుకే.. ఎప్పటికప్పుడు తమ మీద వచ్చిన ఆరోపణలు.. విమర్శలకు బదులు చెప్పే ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ నాయకులు.

రైతు భరోసా యాత్ర పేరిట ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన యాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. రైతు చుట్టూనే తన మాటల్ని పరిమితం చేస్తూ.. రాష్ట్రంలో ఎంతటి అన్యాయమైన పాలన సాగుతుందన్న విషయాన్ని తన తూటాల్లాంటి మాటల్లో చెప్పేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యర్థిపై విమర్శలు చేశామంటే చేశామన్నట్లు కాకుండా.. ఎర్రగా కాల్చిన సువ్వతో వాతలు పెట్టిన రీతిలో ఏపీ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.

చౌకబారు మాటల్ని కట్టి పెట్టి.. తానుచేసే ప్రతి విమర్శ.. ఆరోపణకు లెక్కలు చెబుతున్న జగన్ తీరు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారిందనటంలో సందేహం లేదు. అన్నింటికి మించి సాగునీటికి సంబంధించి జగన్ సంధిస్తున్నప్రశ్నలు బాబు సర్కారుకు నోట మాట రాకుండా చేస్తున్నాయి. వైఎస్ హయాంలో ప్రతి రబీ పంటకు శ్రీశైలం నుంచి సాగునీటిని అందించారని.. గత ఏడాది ఆగస్టు 16 నాటికి 844 అడుగుల నీటి మట్టం ఉన్నా.. రాయలసీమ రైతులకు నీళ్లు ఎందుకు ఇవ్వలేదన్న మాట రైతుల మనసుల్లో బలంగా నాటుకుపోతోంది.

నీళ్లే కాదు.. పంటలకు గిట్టుబాటు ధరలు కూడా దక్కటం లేదన్న మండిపాటుతో పాటు.. కేబినెట్ సమావేశాల్లో రైతుల సమస్యలపై మాట్లాడకుండా.. భూములు ఎలా లాక్కోవాలన్న అంశంపైనే మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. వైఎస్ హయాంలో 23 లక్షల మంది పేదలకు 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే.. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి.. అత్తగారి సొమ్ములా దళితుల భూములు లాక్కుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా జగన్ చేస్తున్న విమర్శలకు..ఆరోపణలకు బాబు వెనువెంటనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో చేసే ఆలస్యానికి మూల్యం తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి.. జగన్ సంధించిన ఆరోపణలపై బాబు క్లారిటీ ఇస్తారా..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News