మోడీ జూనియ‌ర్ స‌రే..లోకేష్ సంగ‌తేంటి బాబు?

Update: 2018-09-21 18:23 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌న‌కు న‌చ్చిన అంశాన్ని త‌న‌కు న‌చ్చిన స‌మ‌యంలో భ‌లే తెర‌మీద‌కు తెస్తార‌ని...ఏదైనా విష‌యాన్ని మ‌రుగున ప‌ర‌చాలంటే ఆయ‌న త‌ర్వాతే ఎవ‌రైనా అంటూ బాబు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు చేస్తుండే సంగ‌తి తెలిసిందే. బాబుపై ఇలాంటి భావ‌న క‌లిగేందుకు గ‌తంలో చోటుచేసుకున్న ఎన్నో ఉదంతాలు కార‌ణం. అయితే తాజాగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో చంద్ర‌బాబు చేసిన కామెంట్లు మ‌రోమారు ఆయ‌న‌ చాణ‌క్యాన్ని తెర‌మీద‌కు తెస్తున్నాయి.

గురువారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో కృష్ణా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జ్ఞానబేరి’ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ``నరేంద్ర మోదీ కంటే నేనే సీనియర్‌ ని.. నేను 1995లో సీఎం అయితే, ఏడేళ్ల తర్వాత 2002లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారని’ పేర్కొన్నారు. అయితే అవకాశం రావడంతో ఆయన ప్రధానమంత్రి అయ్యారు` అని అన్నారు. ఇప్పుడెందుకు బాబు సినియారిటీని ప్ర‌స్తావిస్తున్నార‌నేది ఆయ‌న‌కే తెలియాలి. అదే స‌మ‌యంలో ఈ ప్ర‌స్తావ‌న ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నం కూడా ఆయ‌న‌కు మాత్ర‌మే తెలిసి ఉంటుందేమో! ఎందుకంటే..రాజ‌కీయాల్లో సీనియారిటీ ఆధారంగా ద‌క్కేది ఏదీ ఉండ‌ద‌నే సంగ‌తి దేశంలోనే సీనియ‌ర్ అని చెప్పుకొనే చంద్ర‌బాబుకు తెలియ‌నిది కాదు. స్వ‌యంగా చంద్ర‌బాబు విష‌యానికే వ‌స్తే..తెలుగుదేశం పార్టీలో ఆయ‌న‌కంటే సీనియ‌ర్లు ఎంద‌రో ఉన్న‌ప్పటికీ ఆయ‌నే ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు - పార్టీ అధ్య‌క్షుడిగా కూడా సుదీర్ఘంగా కొన‌సాగుతున్నారు. త‌న వార‌సుడిని కూడా తెర‌మీద‌కు తెచ్చేశారు. ఇవ‌న్నీ సీనియారిటి ప్ర‌కార‌మే జ‌రిగాయని చంద్ర‌బాబు చెప్ప‌గ‌ల‌రా?  పైగా...లోకేష్‌ ను తెర‌మీద‌కు తెచ్చే స‌మ‌యంలో సత్తా చాటుకోవ‌డం ఆధారంగానే కొత్త బాధ్య‌త‌లు ఎత్తుకున్నార‌ని చంద్ర‌బాబు సెల‌విచ్చారు. మ‌రి అలాంటపుడు మోడీ సీనియారిటీని ఎందుకు ప్ర‌స్తావిస్తున్నారో...చంద్ర‌బాబే సెల‌వివ్వాల‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలా పైసా ప్ర‌యోజ‌నం లేని సీనియారిటీని ప్ర‌స్తావించ‌డం వెనుక అయితే స్వోత్క‌ర్ష అయినా అయి ఉండాలి..లేదంటే స్వ‌యంతృప్తి అయినా అయి ఉండాల‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగేళ్ల పాటు క‌లిసి ఉన్న స‌మ‌యంలో గుర్తుకురాని సీనియారిటీ ఇప్పుడు ప్ర‌స్తావ‌న‌కు రావ‌డం వెనుక ఏకైక కార‌ణం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డం అని ఇంకొంద‌రు అంటున్నారు. సంద‌ర్భంతో సంబంధం లేని అంశాల‌ను ఆయ‌నెందుకు ప్ర‌స్తావిస్తున్నార‌ని పార్టీ శ్రేణులు సైతం గొణుక్కోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News