అమరావతి మళ్ళీ మొదలవుతుంది

Update: 2023-06-10 10:03 GMT
ఎన్నికలైపోగానే అమరావతి నిర్మాణం మళ్ళీ మొదలవుతుందని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. శుక్రవారం అమరావతి రైతు జేఏసీ నేతలతోను తర్వాత ఐటీడీపీ విభాగం సభ్యులతోను విడివిడిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ అమరావతి రాజధాని పనులను ప్రారంభించబోతున్నట్లు హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాలకు కలల నగరంగా ఉండాలని తాను అమరావతిని డిజై చేసినట్లు గుర్తుచేశారు.

అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని కాన్సెప్టును నాశనం చేసేసినట్లు మండిపడ్డారు. అమరావతిని అటకెక్కించి మూడు రాజధానులంటు మూడు ముక్కలాట ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని జగన్ కంటిన్యుచేసుంటే లక్షల కోట్ల సంపద రాష్ట్రానికి వచ్చుండేదన్నారు. బంగారుగుడ్లు పెట్టే అమరావతిని జగన్ చేతులార నాశనం చేసేసినట్లు చెప్పారు. రాబోయే ఎన్నికలు టీడీపీకి చాలా కీలకమన్నారు.

రాజమండ్రి మహానాడులో ప్రకటించిన మొదటివిడత మ్యానిఫెస్టోను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాల్సిన బాధ్యతను ఐటీడీపీ సభ్యులకు చంద్రబాబు గుర్తుచేశారు. పార్టీపరంగా మ్యానిఫెస్టోను జనాల్లోకి తీసుకెళుతున్నామని, ఐ టీడీపీ సభ్యులు సోషల్ మీడియాను ఎంత అవకాశముంటే అంతా ఉపయోగించుకోవాలని గట్టిగా చెప్పారు.

రాబోయే ఎన్నికలను పార్టీతో పాటు ఐటీడీపీ సభ్యులంతా ఒక యుద్ధంలాగ తీసుకోవాలన్నారు. మ్యానిఫెస్టోలోని మొదటివిడత హామీలగురించి ఐటీడీపీ సభ్యులకు చంద్రబాబు వివరించి చెప్పారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన భవిష్యత్తుకు గ్యారెంటీ 6 హామీలను జనాల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఐటీడీపీదే అని స్పష్టంగా చెప్పారు.

ఎన్నికలకు ఇకున్నది తొమ్మిది నెలలే కాబట్టి ఎవరు కూడా రిలాక్సయ్యేందుకు లేదన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంచేసినా ఫలితం దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. మ్యానిఫెస్టో గురించి పాజిటివ్ ప్రచారంచేస్తునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని లోపాలను, చేస్తున్న తప్పుల గురించి జనాలకు పదేపదే గుర్తుచేయాలన్నారు.

రెండో విడత మ్యానిఫెస్టో విషయంలో కసరత్తుచేస్తున్నామని దసరా పండుగనాటికి ఫైనల్ అయ్యే అవకాశముందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఇచ్చిన, ఇవ్వబోయే హామీలన్నింటినీ జనాలను వివరించాలని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. పనిలోపనిగా జగన్ తో పాటు మంత్రులపైన కూడా చంద్రబాబు సెటైర్లు వేశారు.

Similar News