ఎన్నికల ముందు చిరాగ్ కు షాకిచ్చిన బీజేపీ

Update: 2020-10-17 11:50 GMT
బీహార్ ఎన్నికల ముందు లోక్ జన శక్తి పార్టీ (ఎల్జేపీ) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కు బీజేపీ పెద్ద షాక్ ఇచ్చింది. బీహార్ లో ఈనెలాఖరులో జరగనున్న మొదటి విడత ఎన్నికలకు ముందు ఎల్జేపీతో తమకు ఎటువంటి సంబంధాలు లేవని స్పష్టంగా ప్రకటించింది. ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చేసిన చిరాగ్ తమకు ప్రధాన ప్రత్యర్ధి నితీష్ కుమార్ మాత్రమే అంటూ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అంటే ఒకవైపు ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చేసిన చిరాగ్ ఒకవైపు నితీష్ పై యుద్ధం ప్రకటిస్తునే మరోవైపు బీజేపీతో మిత్రత్వం ఉందని ప్రకటించటం విచిత్రంగా ఉంది.

ఇదే సమయంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో నితీష్ ను విమర్శిస్తు, ఆరోపణలు చేస్తు పోస్టర్లు రిలీజ్ చేస్తున్న చిరాగ్ ఇదే సమయంలో ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను పోస్టర్లలో వాడుకుంటున్నారు. దీంతో ఓటర్లలో పూర్తి అయోమయం మొదలైపోయింది. ఇంతకాలం ఉపేక్షించిన బిజేపీ నేతలు క్షేత్రస్ధాయిలో తమకు జరుగుతున్న డ్యామేజీని అర్ధం చేసుకున్నట్లున్నారు. అందుకనే అర్జంటుగా సమావేశం పెట్టుకుని ఎల్జేపీకి తమకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించుకున్నారు.

243 సీట్ల అసెంబ్లీకి ఒంటరిగా ఎల్జేపీ పోటి చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నితీష్ నేతృత్వంలోని జేడియూ పోటి చేస్తున్న 122 సీట్లలో బలమైన అభ్యర్ధులను పోటిలోకి దింపుతున్నట్లు చిరాగ్ గతంలోనే ప్రకటించారు. ఇదే సమయంలో బీజేపీ పోటి చేస్తున్న 121 సీట్లలో చాలాచోట్ల ఫ్రెండ్లీ పోటి మాత్రమే ఉంటుందని కూడా చిరాగ్ ప్రకటించాడు. ఇదంతా చూసిన తర్వాత బీజేపీకి ఎల్జీపేకి లోపాయికారీ ఒప్పందాలున్నట్లు బాగా ప్రచారమైపోయింది. ఇటువంటి ప్రచారం వల్ల తమకు తీరని నష్టం జరుగుతుందని బీజేపీ నేతలు చివరిదశలో గుర్తించారు.

ఈ కారణంగానే హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి తమకు ఎల్జేపీకి సంబంధం లేదని ప్రకటించాల్సొచ్చింది. తమకు కాంగ్రెస్ ఎంతో ఎల్జేపీ కూడా అంతేనని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. తమ పోటి కేవలం నితీష్ మీద మాత్రమే అంటు చిరాగ్ చేసిన ప్రకటనను జవదేకర్ ఖండించటానికి నానా అవస్తలు పడ్డారు. ఒక వైపు జవదేకర్ ఇలా ప్రకటిస్తున్న నేపధ్యంలోనే మరోవైపు చిరాగ్ తన ధోరణిలోనే తాను ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచార సభలో మాట్లాడిన చిరాగ్ తన గుండెను చీల్చి చూస్తే మోడినే కనబడతారంటూ ప్రకటించటం గమనార్హం. తాము కాదన్నా చిరాగ్ అంగీకరించకుండా మోడినే తమకు నాయకుడంటూ చేసుకుంటున్న ప్రచారంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
Tags:    

Similar News