బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై బిజినెస్ మ్యాన్ సరికొత్త వాదన

Update: 2019-12-13 05:01 GMT
సంచలనంగా మారిన బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం గురించి తెలిసిందే. అతి వేగం కారణంగా అదుపు తప్పి కారు కింద పడిన ఉదంతంలో ఒక అమాయక మహిళ మరణించటం తెలిసిందే. ఈ తప్పునకు కారణమైన గేమింగ్ కంపెనీ సీఈవో కల్వకుంట్ల కృష్ణ మిలన్‌రావును జనవరి మూడో తేదీ వరకూ అరెస్టు చేయకూడదని హైకోర్టు పేర్కొంది.

ఒక మహిళ మరణానికి.. మరో ముగ్గురు గాయాలకు కారణమైన ఈ బిజినెస్ మ్యాన్ తాజాగా పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు వీలుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తనపై రాయదుర్గం పోలీసులు పెట్టిన కేసుపై తనకున్న అభ్యంతరాల్ని కోర్టు ముందుంచారు.

ఫ్లైఓవర్ నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని.. ప్రమాద సమయంలో తన కారు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో నడుపుతున్నట్లుగా పేర్కొనటం గమనార్హం. అయినప్పటికీ తన కారు అదుపు తప్పి తాను కింద పడినట్లుగా కోర్టుకు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఐపీసీ 304ఏ కింద నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందంటూ కేసు పెట్టారని.. ఆ తర్వాత ఆ కేసులో సెక్షన్ ను 304(2) గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

తనపై పెట్టిన ఐపీసీ సెక్షన్ 304(ఏ).. 337.. 279 కింద కేసులు సరికావని.. తనను పోలీసులు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. నిందితుని తరఫున వాదనలు విన్న హైకోర్టు..నిర్లక్ష్యం కింద నమోదు చేసిన కేసును శిక్షార్హమైన మానవహత్యగా మార్చటాన్ని తప్పు పట్టింది. పిటిషనర్ ను అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల్ని జనవరి మూడో తేదీ వరకూ పొడిగిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు.

కారు ప్రమాదం జరిగిన రోజున.. గంటకు 104కి.మీ. వేగంతో కారు ప్రయాణించినట్లుగా పేర్కొంటూ పోలీసులు చలానా విడుదల చేయటం తెలిసిందే. సీసీ పుటేజ్ లోనూ కారు అమితమైన వేగంతో దూసుకెళ్లిన వైనం కొట్టొచ్చినట్లు కనిపించింది. మరి.. కోర్టులో ఈ విషయాల్ని పోలీసుల తరఫు న్యాయవాది ఎందుకు చెప్పలేకపోతున్నట్లు?


Tags:    

Similar News