అభివృద్ధి చేయాలంటే ఆస్తులు అమ్మాలా భూమా?

Update: 2016-05-28 11:30 GMT
ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి? అభివృద్ధికి ఆస్తులు అమ్మటానికి మించిన మార్గం మరింకేమీ ఉండదా? అన్న ప్రశ్నలు ఈ మధ్యనే టీడీపీ తీర్థం పుచ్చుకున్న కర్నూలుజిల్లా సీనియర్ నేత భూమా నాగిరెడ్డి లేఖ గురించి తెలిసిన వెంటనే మనసుకు మెదులుతాయి. అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం ఆస్తులు అమ్మటమే మార్గమన్నట్లుగా భూమా వ్యవహరించటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గమైన నంద్యాల బస్టాండ్ ఎదురుగా ఉన్న విలువైన స్థలాన్ని అమ్మాలన్న ఆలోచనను భూమా చేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ఇది కాస్తా తాజాగా బయటకు రావటం.. దీనిపై కొత్త రచ్చ మొదలైంది. నంద్యాల బస్టాండ్ కు ఎదురుగా రెండు ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో పశువైద్యశాలతో పాటు.. పశు సంవర్దక శాఖ కార్యాలయం ఉంది.

అయితే.. ఈ రెండింటిని మరో ప్రాంతానికి తరలించి అమ్మకానికి పెడితే.. దాదాపు రూ.10కోట్ల వరకూ నిధులు వస్తాయని లెక్క చెప్పుకొచ్చారు. బహిరంగ మార్కెట్లో రూ.4కోట్ల ధర పలుకుతున్న ఈ భూమిని అమ్మితే గరిష్ఠంగా రూ.10కోట్లు వస్తాయని.. ఆ మొత్తాన్ని నంద్యాల నగర అభివృద్ధికి వినియోగిస్తే బాగుంటుందన్న భావనను భూమా వ్యక్తం చేస్తున్నారు ఇలా ప్రభుత్వం కింద ఉన్న విలువైన ఆస్తుల్ని ఒక్కొక్కటిగా అమ్మేసి అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తే.. రేపొద్దున ఏదైనా అవసరమైతే చేతిలో ఆస్తులు ఉండని పరిస్థితి. వర్తమానాన్ని తప్పించి భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయని భూమా లాంటి వారి మాటలపై బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. అభివృద్ధి కోసం భూములు అమ్మాలంటున్న భూమా మాటలపై సొంత పార్టీకి చెందిన ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేయటం గమనార్హం.
Tags:    

Similar News