భ‌ర‌త్ అనే నేను.. రాజ‌మండ్రి కార్పొరేష‌న్‌ పై క‌న్ను!!

Update: 2021-02-21 09:30 GMT
వైసీపీ యువ ఎంపీ.. పార్టీ పార్ల‌మెంట‌రీ ప‌ద‌వుల్లో కీల‌క స్థానం పొందిన నాయ‌కుడు.. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ రామ్‌.. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న‌దైన శైలిలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. టీడీపీని మించిన రాజ‌కీయాలు చేస్తున్నారు. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు హ‌ఠాత్తుగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఈ వ‌ర్ధ‌మాన సినీ హీరో.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే రాజ‌కీయాల‌ను ఒంట‌బ‌ట్టించుకున్నార‌నే టాక్ ఉంది. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా శాసించే స్థాయికి ఆయ‌న ఎదిగారు. అంతేకాదు.. వైసీపీలో కీల‌క నేత‌గా త‌న‌కు, త‌న మాట‌కు తిరుగు లేద‌న్న‌ట్టుగా గుర్తింపు సాధించారు.

ఈ నేప‌థ్యంలోనే పార్టీ ప‌రంగా కూడా త‌న దూకుడును పెంచుకుని.. త‌న‌కంటూ మ‌రింత ప్ర‌త్యేక స్థానం కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైంది. రాజ‌మండ్రి కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌పై టీడీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. ఎందుకంటే.. ఇక్క‌డ సిటీ, రూర‌ల్ ఎమ్మెల్యేలు ఇద్ద‌రూ కూడా టీడీపీ నాయ‌కులే. సిటీ ఎమ్మెల్యే భ‌వానీ, రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య‌లు దూకుడుగానే ఉన్నారు. అయితే.. మిగిలిన వారు మాత్రం టీడీపీలో సైలెంట్ అయిపోవ‌డం.. ఆ పార్టీకి ఇప్పుడు ఇబ్బందిక‌రంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో అటు ఆదిరెడ్డి భ‌వానీ కానీ.. ఇటు బుచ్చ‌య్య కానీ, కేడ‌ర్‌ను న‌డిపించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
 
ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన వైసీపీ ఎంపీ భ‌ర‌త్ త‌న‌దైన శైలిలో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. యువ‌త‌ను స‌మీక‌రించి.. బాగానే ఖ‌ర్చు చేస్తున్నార‌ని తెలుస్తోంది. పార్టీలో త‌న‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉండ‌డంతో దానిని నిలుపుకొనేందుకు.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రికీ ట‌చ్‌లో ఉన్నారు. వార్డు మెంబ‌ర్ల‌కు కూడా అందుబాటులో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌మండ్రి కార్పొరేష‌న్‌ను టీడీపీ కైవ‌సం చేసుకుంది. కీల‌క‌మైన నాయ‌కులు అప్ప‌ట్లో ముందుండి పార్టీని న‌డిపించారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌లో పార్టీ తీవ్రంగా దెబ్బ‌తిన్న ద‌రిమిలా.. ఇప్పుడు వారంతా మౌనం వ‌హిస్తున్నారు.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున మార్గాని భ‌ర‌త్ దూకుడు పెంచ‌డంతోపాటు.. ఇప్ప‌టికే ఆయ‌న వ్యూహాత్మకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో రాజ‌మండ్రిలో వైసీపీ ఖ‌చ్చితంగా కార్పొరేష‌న్‌ను కైవ‌సం చేసుకుంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. టీడీపీ నాయ‌కులు పెద్ద‌గా దూకుడు చూపించ‌లేక పోవ‌డం, ఖ‌ర్చు విష‌యంలోనూ వెనుకాడుతుండ‌డంతో పార్టీ ప‌రిస్థితి డోలాయ‌మానంలో ప‌డింది. మ‌రోవైపు... చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. ఎట్టిప‌రిస్థితిలోనూ రాజ‌మండ్రిని ద‌క్కించుకునేందుకు రెడీగా ఉండాల‌ని అన్నారు. అయితే.. ఇప్ప‌టికే చెల్లాచెదురైన నాయ‌కుల ప‌రిస్థితిని మాత్రం ఆయ‌న ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఇలా అయితే.. టీడీపీ పుంజుకుంటుందా? అనేది కీల‌క ప్ర‌శ్న‌.!
Tags:    

Similar News