భారత్‌ కి బంగ్లా సాయం..'10వేల రెమిడిసివిర్ ఇంజెక్షన్లు '!

Update: 2021-05-07 08:30 GMT
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి ఇండియా గజగజా వణికిపోతోంది. మొదటి వేవ్ ను సమర్దవంతంగా ఎదుర్కొన్న ఇండియా , ఊహించని విదంగా గత రెండు మూడు వారాల్లోనే భయంకరంగా పెరిగిపోయిన కరోనా సెకండ్ వేవ్ తో అట్టుడికిపోతోంది. దీనితో దేశంలో నాలుగు లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే వేల సంఖ్యలో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. దీనితో ఇండియా ను ఆదుకోవడానికి పలు దేశాలు ముందుకు వస్తున్నాయి. తమకి తోచిన విదంగా భారత్ కి సహాయం అందిస్తున్నాయి. తాజాగా భారతదేశానికి సాయం చేసేందుకు బంగ్లాదేశ్ ముందుకు వచ్చింది. కరోనా చికిత్సలో అత్యవసరమైన రెమిడిసివిర్ ఇంజెక్షన్ సీసాలను 10వేల వరకు భారత ప్రభుత్వ ప్రతినిధికి అందించింది.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితుల్లో చికిత్స కు ఉపయోగించే రెమ్‌ డెసివిర్ ఇంజెక్షన్లను కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషనర్ భారత సరిహద్దు ఓడరేవు పెట్రాపోల్ వద్ద అప్పగించారని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.  కరోనా వైరస్  మహమ్మారి సెకండ్ వేవ్ తో పోరాడటానికి భారతదేశానికి అవసరమైన మందులు, ఇతర అవసరమైన వస్తువులను ఢాకా అందిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది. కొద్ది రోజులకే డ్రగ్ సరఫరా అందించింది. రెమ్‌ డెసివిర్ మోతాదులను బంగ్లాదేశ్‌లోని అతిపెద్ద ఔషధ సంస్థలలో ఒకటైనబెక్సిమ్కో ఉత్పత్తి చేసింది. బంగ్లాదేశ్‌ కు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను అందించడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో భాగస్వామిగా ఉంది. ప్రధానమంత్రి షేక్ హసీనా సూచనల మేరకు ఈ రెమిడిసివిర్ ఇంజెక్షన్లను  భారతదేశానికి పంపినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం తెలిపింది. కరోనాతో పోరాడుతున్న భారత్ కు బంగ్లాదేశ్ అందించిన వైద్య సాయంలో ఇదొకటి. అంతేకాదు.. బంగ్లాదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో విటమిన్ సి, డి, జింక్ సప్లిమెంట్స్, ఎన్ 95 మాస్క్‌ లు, కరోనా చికిత్స కోసం అవసరమయ్యే ముందులను కూడా పంపే అవకాశం ఉంది.  

Tags:    

Similar News