తీవ్రవాదులుగా పొరబడి పౌరులపై సైన్యం కాల్పులు.. 14మంది మృతి.. భగ్గుమన్న రాష్ట్రం

Update: 2021-12-05 11:30 GMT
ఈశాన్య భారత రాష్ట్రం నాగాలాండ్లో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ వికటించింది. సైన్యం పొరపాటుకు 14మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.పలువురు గాయపడ్డారు. ప్రజలు మరణించడంతో రాష్ట్రం భగ్గుమంది. ప్రజలు ఆందోళన చేశారు. మయన్మార్ సరిహద్దుల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

భద్రతా బలగాలకు చెందిన ఓ జవాన్ కూడా ఈ ఘటనలో చనిపోయినట్టు అధికారులు తెలిపారు. గ్రామస్థులను గుర్తించడంలో పొరపాటు వల్లే ఇలా జరిగిందని పోలీస్ వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనపై నాగాలాండ్ ప్రజలు భగ్గుమన్నారు. దీంతో సీఎం నిఫుయూ రియో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని.. అంరదూ సంయమనం పాటించాలని కోరారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.

కాగా నిఘా వర్గాల పక్కా సమాచారంతో భద్రతా బలగాలు తిరు-ఓటింగ్ రహదారిపై ఆకస్మిక దాడికి వ్యూహరచన చేశాయి. అయితే పొరపాటున గ్రామస్థులను తిరుగుబాటుదారులుగా భావించి సైన్యం కాల్పులు జరిపిందని తెలిసింది. దాదాపు ఈ కాల్పుల్లో 14 మందికి పైగా గ్రామస్థులు మృతిచెందినట్టు తెలిసింది.

గ్రామస్థులు చనిపోవడంతో స్థానికులు రెచ్చిపోయారు. కోపోద్రిక్తులయ్యారు. ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకొని భద్రతా బలగాలను చుట్టుముట్టారు. సైనికుల వాహనాలకు నిప్పటించి సైన్యంపైకి దూసుకొచ్చారు. వారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి సైన్యం ఆత్మరక్షణ కోసం కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు.
Tags:    

Similar News