టీడీపీ కంచుకోటలో గట్టిగా దించుతున్న వైసీపీ

Update: 2023-01-24 05:00 GMT
తెలుగుదేశం పార్టీకి ఏపీలో కంచుకోటలు కొన్ని ఉన్నాయి. అవి ఎలాంటివి అంటే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ ఎంత బలంగా ఊపేసినా కూడా చెదరక బెదరక సైకిలు జోరు చేసిన సీట్లు అవి. వాటిలో ప్రకాశం జిల్లా నుంచి చీరాల నియోజకవర్గం ఒకటి. ఇక్కడ కరణం బలరాం 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆయన రాజకీయం నాలుగున్నర దశాబ్దాల నాటిది. కానీ ఒక్కసారి కూడా మంత్రి కాలేదు.

చంద్రబాబుకు మద్దతు ఇచ్చినా తనకు మంత్రి పదవి అయినా ఇవ్వలేదు అన్న అలక ఒక వైపు మరో వైపు కుమారుడి ఫ్యూచర్ ని చూసుకుని ఆయన 2019 తరువాత వైసీపీలోకి జంప్ చేశారు. ఆయన గత మూడేళ్ళుగా జగన్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన కుమారుడు వెంకటేష్ కి టికెట్ ఇవ్వాలని షరతు మీదనే వైసీపీలో  చేరారు అని చెబుతారు. అయితే ఆయన మీద 2019లో ఓడిన వైసీపీ నేత ఆమంచి క్రిష్ణ మోహన్ నిన్నటిదాకా అడ్డుగా ఉన్నారు.

దాంతో ఆయనకు నచ్చచెప్పి పర్చూరు కి జగన్ పంపించగలిగారు. అలా చీరాలలో బలమైన పోటీ తప్పింది. ఇక ఎమ్మెల్సీ పోతుల సునీత ఈ సీటుని ఆశిస్తున్నారు. ఆమెకు మరో విడత ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పి జగన్ నచ్చచెప్పడంతో ఇపుడు కరణం ఫ్యామిలీకి ఎదురులేకుండా పోయింది. దాంతో కరణం వెంకటేష్ అభ్యర్ధిత్వాన్ని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బీద మస్తాన్ రావు ప్రకటించారు.

తొందరలోనే దీని మీద జగన్ అధికార ముద్ర వేస్తారని ఆయన చెప్పడం విశేషం. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనక పక్కా ప్లానింగ్ ఉంది అంటున్నారు. ప్రకాశం జిల్లా మొత్తం మీద కరణం బలరాం కి పట్టుంది. దాన్ని వాడుకునే ఉద్దేశ్యంతోనే ఆయన కుమారుడికి చీరాల టికెట్ ప్రకటించారు అని అంటున్నారు. దాని కోసం ఆమంచి క్రిష్ణ మోహన్ ప్లేస్ కూడా చేంజి చేశారు అని అంటున్నారు. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న కరణం కనుక కలసివస్తే మరోసారి ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుందని లెక్కలేసుకుంటున్నారు.

ఇదిలా ఉండగా తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చిన నలుగుగు ఎమ్మెల్యేలలో కరణం ఫ్యామిలీకి ఫస్ట్ టికెట్ కన్ ఫర్మ్ అయింది. దాంతో మిగిలిన వారి సంగతి ఏంటి అన్న చర్చ సాగుతోంది. క్రిష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కూడా టికెట్ కన్ ఫర్మ్ చేస్తారు అని అంటున్నారు. అక్కడ వైసీపీలో ఆది నుంచి ఉన్న ఇద్దరు పాత కాపులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావులలో ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి మరొకరికి కీలక పదవి అప్పచెప్పి వంశీకి లైన్ క్లియర్ చేయాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు.

అలాగే గుంటూరు పశ్చిమ నుంచి గెలిచిన మద్దాలి గిరితో పాటు విశాఖ సౌత్ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ లకు కూడా టికెట్లు ఇస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి టీడీపీ కంచుకోటలో కరణం కి టికెట్ ఇచ్చి జగన్ ఎన్నికలకు సై అంటున్నారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి చేరిన వారికి అభయ హస్తం ఇస్తున్నారు. దీని వల్ల ఫ్యూచర్ లో ఎవరు తమ వైపు చేరినా వారికి సేఫ్ జోన్ చూపిస్తామని సంకేతాలు పంపుతున్నారు అని అంటున్నారు. ఇక కరణం బలరాం ప్రకాశం జిల్లాలో రాజకీయ సమరం ఎలా చేస్తారో చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News