రేపే ఏపీ అసెంబ్లీ... రాజదానిపై జగన్ తేల్చేస్తారా?

Update: 2020-01-19 16:47 GMT
ఏపీలో ఇప్పుడంతా రాజధానిపైనే చర్చ జరుగుతోంది. గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ, గుంటూరుల మధ్య అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తే... జగన్ సీఎం అయ్యాక అమరావతిని కేవలం లెజిస్లేచర్ కేపిటల్ కు పరిమితం చేసేసి, కీలకమైన ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను విశాఖలో, జ్యుడిషియల్ కేపిటల్ ను కర్నూలులో ఏర్పాటు చేసే దిశగా వైసీపీ సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఈ దిశగా సాగుతున్న జగన్ తనదైన స్పీడుతో ముందుకు సాగుతున్నారు. సోమవారం ఉదయం తొలుత కేబినెట్ భేటీ నిర్వహించనున్న జగన్... ఆ వెంటనే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లనున్నారు. ముందుగా జరగనున్న కేబినెట్ భేటీలో రాజధానిపై ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపి, ఆ వెంటనే సదరు నివేదకకు అసెంబ్లీ ఆమోదం కూడా లభించేలా ప్లాన్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఓ వైపు రాజధానిని అమరావతి నుంచి తరలిస్తే ఒప్పుకునేది లేదంటూ రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు, వారికి మద్దతుగా టీడీపీ సాగిస్తున్న ఆందోళనలు ఆదివారం నాటికి 33వ రోజుకు చేరుకున్నాయి. ఆందోళనలను ఎంతమాత్రం పట్టించుకోనట్టే కనిపిస్తున్న జగన్.. తాను అనుకున్నట్లుగా రాష్ట్రానికి మూడు రాజధానులను చేసి తీరాలన్న కసితో సాగుతున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఓ పకడ్బందీ ప్లాన్ ను కూడా జగన్ రచించుకున్నట్లుగానే సమాచారం. అమరావతి పేరిట టీడీపీ సర్కారు పాల్పడ అవినీతిని ఫోకస్ చేస్తూనే... ఆ అవినీతిని కూకటి వేళ్లతో పెలికించేలా వ్యవహరిస్తున్న జగన్... మూడు రాజధానులపై ఏమాత్రం వెనక్కు తగ్గరన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Read more!

ఈ దిశగా ఇప్పటికే మొత్తం కార్యరంగాన్ని సిద్దం చేసుకున్న జగన్... చట్టపరంగా అడ్డంకులు ఎదురు కాకుండా ఉండేలా పావులు కదుపుతున్నారన్న మాట కూడా వినిపిస్తోంది. అందులో భాగంగానే ముందుగా జీఎన్ రావు కమిటీ, ఆ తర్వాత బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ లతో నివేదికలను సిద్దం చేయించిన జగన్... వాటిపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీతో కూడా నివేదికను సిద్ధం చేయించారు. ఈ నివేదికకు రేపటి కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేయనున్న జగన్... ఆ వెంటనే ఎంతమాత్రం గ్యాప్ ఇవ్వకుండానే అసెంబ్లీలో ఆ నివేదికకు ఆమోదం లభించేలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఏపీ రాజధాని విషయంపై జరుగుతున్న రచ్చకు రేపటి కేబినెట్ భేటీ, అసెంబ్లీ సమావేశాలతో జగన్ చెక్ పెట్టేయనున్నారన్న మాట అయితే గట్టిగానే వినిపిస్తోంది.


Tags:    

Similar News