ఇండియా బాటలో అమెరికా - సింగపూర్

Update: 2020-04-06 10:50 GMT
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి దెబ్బ మామూలుగా లేదు. బహుశా ఓ వ్యాధి ప్రపంచం మొత్తాన్ని ఈ స్థాయిలో పీడించడం ఇదే తొలిసారి కావచ్చు. ప్రపంచ యుద్ధాల్లాంటి ఉపద్రవాల్ని - మరెన్నో వ్యాధులను తట్టుకుని నిలబడ్డ ప్రపంచం.. కరోనా ధాటికి మాత్రం అల్లాడుతోంది. ప్రపంచంలోని 90 శాతం దేశాలు కరోనా బారిన పడటం దీని తీవ్రతను తెలియజేస్తుంది. ఇలాంటి సమయం లో అమెరికా సహా అభివృద్ధి చెందిన దేశాలు సులువుగా ఉపద్రవాన్ని దాటేస్తాయని.. తక్కువ నష్టం తో బయట పడతాయని అనుకుంటాం.

కానీ ఈ అగ్రరాజ్యంతో పాటు ఇటలీ - స్పెయిన్ - యూకే లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలే కరోనా ధాటికి అల్లాడిపోతున్నాయి. భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఇలాంటి ఏదైనా ఉపద్రవం వచ్చినపుడు ఇండియా లాంటి దేశాల్లో ప్రజలకు ప్రభుత్వం నుంచి నిర్దిష్ట మొత్తంలో ఆర్థిక సాయం అందడం మామూలే. మన దగ్గర వేరే సమయాల్లో కూడా ఇలా ప్రభుత్వాల నుంచి ప్రజలకు డబ్బులు - తాయిలాలు అందడం మామూలే. కానీ ఇప్పుడు అమెరికా - సింగపూర్ లాంటి దేశాలు కూడా భారత్‌ ను అనుసరిస్తూ ప్రజలకు ఆర్థిక సాయం అందించే ప్రయత్నాల్లో పడటం గమనార్హం.

కరోనా ధాటికి పనుల్లేక - ఆదాయం లేక - బయటికి వెళ్లే వీలు లేక లాక్ డౌన్ అయిపోయిన తమ పౌరులకు అమెరికా సాయం అందించానికి ముందుకొచ్చింది. ప్రతి కుటుంబానికి 1200 డాలర్ల చొప్పున ఆర్థిక సాయాన్ని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించాడు. నేరుగా అకౌంట్లలోకి డబ్బులు ట్రాన్స్‌ ఫర్ చేస్తున్నారక్కడ. సింగపూర్ సైతం ఇదే బాటలో నడిచింది. కొంచెం ఆలస్యం గా దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సింగపూర్.. ప్రతి కుటుంబానికి 600 సింగపూర్ డాలర్లు సాయంగా ప్రకటించింది. మొత్తానికి కరోనా విషయంలో భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అమెరికా - సింగపూర్ లాంటి దేశాలు ఆదర్శంగా తీసుకోవడం విశేషమే.
Tags:    

Similar News