ఒకప్పుడు అది హాట్ సీట్.. ఇప్పుడు హర్రర్ సీట్

Update: 2019-11-08 16:30 GMT
హైదరాబాదీయుల్లో కొంతమందికి మాత్రమే పరిచయమున్న అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతం.. తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం చేసిన ఉదంతంతో ఒక్కసారిగా సుపరిచితమైంది. ఒకప్పుడు ఎలాంటి ఆదాయ వనరు పెద్దగా లేని ఈ రెవెన్యూ డివిజన్ లో ఇప్పుడు భూముల ధరలు కోట్లు పలుకుతుండంతో సీన్ మొత్తం మారిపోయింది. ఆఫీసులోనే విజయారెడ్డిని దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో.. ఇప్పుడామె స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి.

దీంతో.. సరూర్ నగర్ తహసీల్దార్ శ్రీనివాసరెడ్డికి అబ్దుల్లాపూర్ మెట్ బాధ్యతలు ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పజెప్పారు. అయితే.. ఆయన కూడా అయిష్టంగా ఓకే చెప్పినట్లు తెలిసింది. వాస్తవానికి విజయారెడ్డి హత్య అనంతరం.. ఆ స్థానంలో పలువురికి పోస్టింగులు ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ఎవరూ ముందుకు రాకపోగా.. మాకొద్దా పోస్టింగ్ అంటూ వణికిపోతున్నట్లు చెబుతున్నారు.

వాస్తవానికి భూములు ధరలు ఎక్కువగా ఉన్న రెవెన్యూ డివిజన్ కు తహసీల్దార్ పోస్టింగ్ అంటే పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. విజయారెడ్డి ఉదంతానికి ముందు వరకూ అక్కడి పోస్టింగ్ అంటే హాట్ కేక్ లా ఉండేదని.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా అదో హర్రర్ పోస్టింగ్ అన్న భావన రెవెన్యూ విభాగంలో వినిపిస్తోంది.

దీనికి తగ్గట్లే తాజాగా అబ్దుల్లాపూర్ మెట్ రెవెన్యూ డివిజన్ కు పోస్టింగ్ అంటే చాలు.. రెవెన్యూ ఉద్యోగులు వణికిపోతున్నారట. అబ్దుల్లాపూర్ మెంట్ కు పోస్టింగా? మాకొద్దండి.. దయచేసి మమ్మల్ని వదిలేయండంటూ ప్రాధేయపడుతున్నట్లు చెబుతున్నారు.  దీంతో.. ఉన్నతాధికారులకు ఇప్పుడు సంకట స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇన్ ఛార్జిని నియమించి మమ అనిపించారు. మరి.. పూర్తిస్థాయి బాధ్యతల్ని స్వీకరించేందుకు ముందుకొచ్చే ధీశాలి ఎవరన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News