కుంభ‌మేళాకు ఈ ఫ్రెంచ్ సాధువు సో స్పెష‌ల్‌

Update: 2018-12-31 13:14 GMT
గంగా - యమున - సరస్వతి నదుల సంగమ స్థానం లక్షలాది మంది భక్తులతో జనసంద్రంగా మారనుంది. ఉత్తరప్రదేశ్‌ లోని ప్రయాగరాజ్ (అలహాబాద్)లో జనవరి 15 నుంచి అర్ధ కుంభమేళా జరగనున్న నేపథ్యంలో ఫ్రాన్స్‌ కు చెందిన ఓ సాధువు అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రశాంతతను వెతుక్కుంటూ 30 ఏళ్ల‌ కిందట భారత్‌ కు వచ్చిన డేనియల్‌ కు మనదేశం బాగా నచ్చింది. దీంతో స్వదేశంలో ఉన్న వ్యాపారాలన్నింటినీ వదులుకుని ఇక్కడే సాధువుగా కొత్త జీవితం ప్రారంభించాడు. హిందూ మతంలోకి మారి భగ్‌ వాన్ గిరి(అనుచరులు అలాగే పిలుస్తారు)గా అవతరించాడు. ఆయన హిందీ కూడా మాట్లాడగలడు. సనాతన ధర్మం అంటే ఎంతో ఇష్టమని - అది శాంతితో కూడుకున్నదని చెప్పారు. తాము ఒకే దేవుడిని విశ్వసిస్తామని - పేర్లు ఎన్ని ఉన్నా ఆత్మ ఒక్కటే అని పేర్కొన్నారు. యోగా - ధ్యానం - భజనలు చేసుకుంటూ ఆయన సాధుజీవితం గడుపుతున్నారు. అర్ధ కుంభమేళా పూర్తయ్యేవరకు ఈ ఫ్రెంచ్ బాబా ఇక్కడే ఉండనున్నారు.

ఇదిలాఉండ‌గా - కుంభ‌మేళాకు వ‌చ్చే వారందరికి సౌకర్యాలు కల్పించడం ఎవరికైనా కత్తిమీద సామే. పనిలో పనిగా పలు సంస్థలు భక్తులను ఆకట్టుకునేందుకు సకల సౌకర్యాలతో త్రివేణి సంగమం వద్ద భారీ స్థాయిలో అత్యాధునిక గుడారాలు (టెంట్లు) సిద్ధం చేస్తున్నాయి. వీటిలో ఒక రాత్రి బసకు రూ.35వేల వరకు వసూలు చేయనున్నారు. ముఖ్యంగా ప్రవాస భారతీయులు - సంపన్నులు - పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు వీటిని సిద్ధం చేశారు. ఇక బడ్జెట్ గుడారాలు కూడా ఉన్నాయండోయ్. ఇక్కడ గరిష్ఠంగా 15వేల నుంచి కనిష్ఠంగా 3,500 వరకు చార్జి చేయనున్నారు. ఇక కేవలం ఒక రాత్రి బస చేసేందుకు మంచాల్ని అద్దెకిచ్చే వారూ ఉన్నారు. వీరు కనిష్ఠంగా రూ. 500 నుంచి వెయ్యి వరకు వసూలు చేయనున్నారు.
Tags:    

Similar News