ఆర్టీఐ కింద ఒకే వ్యక్తి 545 అప్లికేషన్లు.. అన్నింటికి ఒకే ఉత్తర్వుతో మోక్షం

Update: 2022-09-25 07:55 GMT
ప్రజల చేత ఎన్నుకోబడే ప్రజా ప్రభుత్వాలు.. తమ పాలనకు సంబంధించిన నిర్నయాల్ని ప్రజలకు ఇచ్చే విషయంలో వ్యవహరించే తీరు నేపథ్యంలో.. వారు కోరుకున్న సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు వీలుగా ఆర్టీఐ (సమాచార హక్కు చట్టాన్ని) ను తీసుకు రావటం తెలిసిందే. ఈ చట్టం వచ్చిన తర్వాత బయటకు వచ్చినఅధికారిక సమాచారంతో పలు సందర్భాల్లో కొత్త సంచలనాలకు తెర లేవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణలో ఒక వ్యక్తి ఆర్టీఐ చట్టం కింద 545 అప్లికేషన్లు పెట్టి ఆశ్చర్యానికి గురి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించిన పలు వివరాల్ని సేకరించేందుకు వీలుగా ఇంత భారీగా దరఖాస్తులు పెట్టారు. ఇంతకీ ఆయన ఎవరంటే.. హైదరాబాద్ కు చెందిన శ్రీనివాసరెడ్డి అనే న్యాయవాదిగా తేలింది. అయితే.. ఇక్కడో ఆసక్తికర అంశం ఉంది. సదరు న్యాయవాది దాఖలు చేసిన 545 అప్లికేషన్లకు ఒకే ఒక్క ఉత్తర్వుతో సమాధానం ఇచ్చేశారు తెలంగాణ సమాచార హక్కు కమిషనర్ గా వ్యవహరిస్తున్న బుద్ధా మురళి.

రాష్ట్ర ఆర్థిక శాఖకు సంబంధించి బడ్జెట్ లో వివిధ పద్దుల కింద ఎంతెంత బడ్జెట్ కేటాయించారు? ఎంత ఖర్చు చేశారో వివరాలు అందజేయాలంటూ ఒక్కో అంశంపై పది పేజీలతో కూడిన 545 అప్లికేషన్లు దాఖలు చేస్తే..ఏడాది వ్యవధిలో ఆయన అప్లికేషన్లను పరిశీలించిన కమిషనర్ బుద్దా మురళి.. వాటన్నింటికీ ఒకే ఉత్తర్వునిస్తూ ఆయన కోరిన సమాచారాన్ని ఇవ్వాలని ఆర్థిక శాఖను ఆదేశించారు.

సదరు దరఖాస్తుదారుకోరిన సమాచారం మొత్తం బడ్జెట్ పుస్తకాల్లో ఉంటాయని అధికారులు సమాచారం ఇవ్వగా.. వ్యయం వివరాలు కూడా ఇవ్వాలని చీఫ్ కమిషన్ ఆదేశించారు. ఒకే వ్యక్తి వందల సంఖ్యలో దరఖాస్తులు చేయటం ద్వారా అధికారుల టైం వేస్టు కావటమే కాదు.. కమిషనర్ పై భారం పడుతుందని వ్యాఖ్యానించటం గమనార్హం. నిజానికి ప్రజల్లో చైతన్యం లేదు కానీ.. ఉంటే.. సమాచార హక్కు చట్టం కింద పెద్ద ఎత్తున అప్లికేషన్లు వందలాది మంది పెడితే అప్పుడేం చేస్తారు? అన్నది ప్రశ్న. ఏమైనా.. వందలాది అప్లికేషన్లు పెట్టిన వ్యక్తి సమాచార వివరాల్ని అందించటం ద్వారా చీఫ్  కమిషనర్ బుద్ధా మురళి కొత్త ట్రెండ్ కు తెర తీశారని చెప్పాలి.
Tags:    

Similar News