గున్న ఏనుగు కోసం 11 ఏనుగులు బలి

Update: 2019-10-10 01:30 GMT
థాయ్ ల్యాండ్ దేశంలోని ఖావో యాయ్ జాతీయ అటవీ పార్క్ లో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్క్ లోని ఓ జలపాతంలో పడి మరణించిన ఏనుగుల సంఖ్య 11 కు చేరింది. థాయ్ ల్యాండ్ జాతీయ జంతువు అయిన ఏనుగులు ఇలా మరణించడంపై విచారణ జరుపుతున్నారు.

జాతీయ పార్క్ లోని ఏనుగుల గుంపు ఈ జలపాతాన్ని పైనుంచి దాటుతుండగా వరద ఉధృతికి ఒక 3 ఏళ్ల చిన్న గున్న ఏనుగు పిల్ల పట్టుతప్పి జలపాతంలో పడిపోతుండగా.. దాన్ని కాపాడేందుకు మరో ఏనుగు ప్రయత్నించింది. ఆ తర్వాత వరుసగా ఏనుగులు కాపాడేందుకు ప్రయత్నించి పట్టుతప్పి జలపాతం కింద లోయలో పడిపోయినట్టు తెలిసింది.

మొదట ఈ ఘటనలో ఏనుగు పిల్లతోపాటు ఐదు ఏనుగుల మృతదేహాలు లభించాయి. దీంతో ఆరు ఏనుగులు చనిపోయాయని అంతా భావించారు. కానీ తాజాగా డ్రోన్ సాయంతో వెతకగా మరో ఐదు ఏనుగుల మృతదేహాలు గుర్తించారు. దీంతో మొత్తం 11 ఏనుగులు మృత్యువాతపడ్డట్టు గుర్తించారు.

ఏనుగుల గుంపు జలపాతం దాటి నది అవతలివైపునకు వెళ్లేందుకు ప్రయత్నించే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో కొండపై చిక్కుకుపోయిన రెండు ఏనుగులు కనిపించాయి. వాటిని తాళ్ల సాయంతో అధికార యంత్రాంగం పైకి లాగి కాపాడాయి. ఆ రెండు ఏనుగులు నీరసించిపోయి ప్రమాదకర స్థితికి చేరాయి. వాటిని పార్క్ సిబ్బంది బలమైన ఫుడ్ సప్లిమెంట్ల ఆహారం అందించారు.

1992లో కూడా ఇదే జలపాతం నుంచి పడి ఒక గుంపులోని 8 ఏనుగులు మృతిచెందాయి. ఇప్పుడు తాజాగా 11 మృతిచెందడం విషాదం నింపింది. ప్రమాదకరమైన ఈ జలాపాతాన్ని స్థానికులు ‘నరక జలపాతం’ అని పిలుస్తారు.

    

Tags:    

Similar News