విషయం పెద్దదే: ఏఐ తీర్పులు.. సుప్రీం తీవ్ర ఆందోళన
సుప్రీం న్యాయమూర్తులు వ్యక్తం చేసిన ఆందోళనకు కారణాలు.. అందుకు దారి తీసిన పరిణామాల వివరాల్లోకి వెళితే..;
ప్రపంచాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్న కృత్రిమ మేధ.. చివరకు న్యాయ వ్యవస్థలోకి చొరబడిందా? దీన్ని అసరాగా చేసుకొన్న వేళ.. జరుగుతున్న తప్పులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం తాజాగా ఆందోళన వ్యక్తం చేయటం.. ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. ఈ సమస్య మన దేశంలో మాత్రమే కాదని.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లోనూ ఉందన్న విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
సుప్రీం న్యాయమూర్తులు వ్యక్తం చేసిన ఆందోళనకు కారణాలు.. అందుకు దారి తీసిన పరిణామాల వివరాల్లోకి వెళితే.. కొత్త టెన్షన్ కు గురికావటం ఖాయం. ఈ మొత్తం ఇష్యూను సింఫుల్ గా ఒక్క లైనులో చెప్పేస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. ఎక్కడ తప్పు జరుగుతుందన్న విషయంపై అవగాహన పెరుగుతోంది. అదే సమయంలో.. జరిగిన తప్పులకు ఏ ఒక్కరినో నిందించకుండా.. సరికొత్త సాంకేతికత ఎలాంటి పరిస్థితులకు తెర తీస్తోంది? దీని విషయంలో న్యాయ వ్యవస్థ ఏం చేయాలన్న దానిపై కొత్త చర్చకు తెర తీసిన పరిస్థితి.
ఇంతకూ ఈ మొత్తం ఉదంతాన్ని ఒక్క లైనులో చెప్పాల్సి వస్తే.. ఉనికిలో లేని కేసులను ఏఐ సృష్టించడం..వాటిని నిజమని నమ్మి న్యాయమూర్తులు ఏకంగా తీర్పులే ఇవ్వటమే అసలు సమస్య. ఈ అంశంపై తాజాగా సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఇదో ‘తీవ్రమైన ముప్పు’గా అభివర్ణించారు. ఇటీవల దేశంలోని రెండు కేసులకు సంబంధించిన అంశాలు తాజాగా సుప్రీం ధర్మాసనం దృష్టికి వచ్చాయి.
మొదటి ఉదంతం
ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ట్రయల్ కోర్టు జడ్జి, ఆస్తి వివాదంలో ఏఐ సృష్టించిన నాలుగు నకిలీ తీర్పులను నిజమని నమ్మారు. వాటి ఆధారంగా చేసుకొని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులు ఏ ‘లా’ రికార్డుల్లోనూ లేవని తేలడంతో సుప్రీంకోర్టు షాక్‌కు గురైంది.
రెండో ఉదంతం
'హార్ట్ అండ్ సోల్ ఎంటర్‌టైన్‌మెంట్' కేసులో ఒక కక్షిదారు చాట్ జీపీటీ సాయంతో కొన్ని కల్పిత కేసులను కోర్టుకు సమర్పించారు. సదరు కంపెనీ డైరెక్టర్ కోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక వాదనల్లో ఏఐ క్రియేట్ చేసిన నకిలీ కేసులను కేస్ స్టడీస్ గా చేర్చారు. దీనిని గమనించిన బాంబే హైకోర్టు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.50వేలు ఫైన్ విధించారు.
ఈ రెండు ఉదంతల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ ధర్మాసనం ఏఐ సాయంతో జరుగుతున్న దారుణ తప్పులను ప్రస్తావిస్తూ..ఆందోళన వ్యక్తం చేయటంతో పాటు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ సందర్భంగా ఆంధ్రప్రదేవ్ ట్రయల్ కోర్టు వ్యవహారాన్ని విచారిస్తూ.. ఏఐ క్రియేట్ చేసిన నకిలీ తీర్పుల ఆధారంగా ఒక న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవటం కేవలం పొరపాటు కాదని.. మిస్ కాండక్టు అవుతుందని పేర్కొన్నారు. ఇది న్యాయ వ్యవస్థ సమగ్రతకు సంబంధించిన అంశంగా పేర్కొంటూ సీరియస్ హెచ్చరికలు చేశారు.
ఈ వ్యవహారాల్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఏఐ వినియోగంపై జాతీయ స్థాయిలో మార్గదర్శకాలు రూపొందించేందుకు అటార్నీ జనరల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది.దీనిపై సాయం చేసేందుకు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ ను అమికస్ క్యూరీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆయన సమర్పించిన ప్రాథమిక నివేదికలో పలు సూచనల్ని చేశారు. అందులో ప్రధానమైనవి చూస్తే..
- ఏఐ టూల్స్ ద్వారా రూపొందించిన సమాచారాన్ని కోర్టుకు సమర్పించే ముందు సదరు లాయర్ దానిని ధ్రువీకరించాలి.
- న్యాయవాదులు తాము సమర్పించిన కేసులు నిజమైనవని పేర్కొంటూ ఒక ప్రకటన చేయాలి. లేదంటే.. ఒక అఫిడవిట్ సమర్పించాలి.
- కేసులకు సంబంధించి డాక్యుమెంట్లను న్యాయస్థానాలు సైతం ఏఐ కంటెంట్ ఏమైనా ఉందా? అన్న విషయాన్ని తనిఖీ చేసేందుకు ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ లను ఉపయోగించాలి.
- న్యాయమూర్తులకు ఏఐ ద్వారా క్రియేట్ చేసే నకిలీ తీర్పులను గుర్తించటం.. వాటికి సంబంధించి శిక్షణ ఇవ్వాలి.
- ఏఐ టూల్స్ నకిలీ కేసులను క్రియేట్ చేస్తాయి. ఇది న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. అందుకే నకిలీ తీర్పులను ఉపయోగించిన న్యాయవాదులపైనా.. అధికారులపైనా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి.
- దేశ వ్యాప్తంగా అన్ని కోర్టులకు వర్తించేలా ఏఐ వినియోగంపై ప్రోటోకాల్ ను రూపొందించాలి.
ఏపీకి చెందిన న్యాయమూర్తి ఏఐ జనరేట్ చేసిన తప్పులకు సంబంధించి ఉదంతంలో ఏపీ హైకోర్టుకు వివరణ ఇచ్చారు. చట్టపరమైన పరిశోధన కోసం తాను తొలిసారి ఏఐ టూల్ ను ఉపయోగించానని.. అది ఇచ్చిన సమాచారం నిజమని నమ్మి తనిఖీ చేయకుండానే తీర్పులో పేర్కొన్న విషయాన్ని అంగీకరించారు. ఎవరినీ తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం తనకు లేదని.. గుడ్ ఫెయిత్ తో జరిగిన పొరపాటుగా వివరణ ఇచ్చారు.
ఈ వివరణను తీసుకున్న ఏపీ హైకోర్టు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ హెచ్చరించారు. ఏపీ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీన్ని కేవలం పొరపాటుగా చూడలేవని.. చట్టపరమైన పరిణామాలు ఉంటాయని పేర్కొంది. సదరు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 10కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ఏఐ సాంకేతికత న్యాయవ్యవస్థలో కొత్త ఆందోళనకు గురి చేస్తుందని చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ తరహా ఉదంతాలకు చెక్ పెట్టేలా మార్గదర్శకాల్ని రూపొందించాల్సిన అవసరం ఉంది.