తిరుమల లడ్డూ కేసు.. దూకుడు పెంచిన సిట్.. నెక్ట్స్ వైవీ సుబ్బారెడ్డేనా?

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అభియోగాలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ నోటీసులు జారీ చేసింది.;

Update: 2025-11-11 10:10 GMT

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే అభియోగాలపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ నోటీసులు జారీ చేసింది. సుబ్బారెడ్డి గతంలో టీటీడీ చైర్మన్ గా ఉండగా, లడ్డూ ప్రసాదం తయారీకి ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డెయిరీకి అనుమతిలిచ్చారు. ఆ సంస్థ 2019-24 మధ్య ఐదేళ్ల పాటు నెయ్యి సరఫరా చేయగా, ఒక్క లీటర్ కూడా నాణ్యమైన స్వచ్ఛమైన నెయ్యి సరఫరా చేయలేదని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. దీనిపై తాజాగా కోర్టుకు నివేదిక సమర్పించిన సిట్ అధికారులు అప్పట్లో టీటీడీలో కీలక బాధ్యతల్లో ఉన్నవారికి వరుసగా నోటీసులిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించారు. అదేసమయంలో అప్పటి టీటీడీ చైర్మన్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులిచ్చింది.

వైసీపీ అధినేత జగన్ కు బాబాయ్ అయిన వైవీ సుబ్బారెడ్డి గత ప్రభుత్వంలో సుమారు నాలుగేళ్లపాటు టీటీడీ చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే భోలేబాబా డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశమై విచారణకు ఆదేశించగా, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సీబీఐ సిట్ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో పలువురి పాత్ర ఉందని నిర్ధారించి అరెస్టులు చేసింది. ఇందులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వద్ద ప్రైవేటు పీఏగా పనిచేసిన చిన్న అప్పన్నను కొద్దిరోజుల క్రితం అరెస్టు చేసింది.

ఇక వైవీ సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదంగా ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) హైకోర్టుకు కొద్దిరోజుల క్రితం నివేదించింది. ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌, భోలేబాబా డెయిరీలు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు తేలినప్పటికీ.. సుబ్బారెడ్డి అప్పట్లో ఆ కంపెనీలపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా, ఆ తర్వాత కూడా ఆ సంస్థలను ఆయన అనుమతించారని సిట్ తన పిటిషన్ లో వివరించింది. వైవీ సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీలపై అనుమానం ఉన్నందున వారి బ్యాంకు ఖాతాల వివరాలు కోరుతున్నట్లు ఆ పిటిషన్ లో తెలిపింది.

ఈ పరిస్థితుల్లో సుబ్బారెడ్డిని విచారణకు రమ్మంటూ సిట్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని విచారించిన సిట్.. మరోవైపు సుబ్బారెడ్డికి నోటీసులివ్వడంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు పతాకస్థాయికి చేరినట్లు భావిస్తున్నారు. కాగా, సిట్ నోటీసులు అందుకున్న సుబ్బారెడ్డి ఈ నెల13 లేదా 15వ తేదీన విచారణకు హాజరవుతానని సమాచారమిచ్చినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News