వైసీపీ విషయంలో రెడ్ల స్టాండ్ అదేనా ?

మరో వైపు చూస్తే వైసీపీ భారీ ఓటమిని 2024 ఎన్నికల్లో అందుకుంది. దాని వెనక కూడా రెడ్ల తీవ్ర అసంతృప్తి ఉందని అంటున్నారు.;

Update: 2025-08-01 13:33 GMT

వైసీపీ అంటే సాధారణంగా బలమైన ఒక సామాజిక వర్గం వెంట ఉంటుందని అనుకుంటూంటారు. ఏపీ అంటేనే కులాల సమాహారం. రాజకీయాలలో సంకుల సమరం సాగుతుంది ఎంత చెప్పుకున్నా ఇదే కొనసాగుతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ వెనక ఒక బలమైన సామాజిక వర్గం ఉందని కూడా చెబుతారు. అయితే ఈ బలాన్ని ఆలంబనగా చేసుకుని అధికారం అందుకున్న పార్టీలు వారికి సరైన న్యాయం చేయకపోతే మాత్రం వ్యవహారం వేరేలా ఉంటుంది. వైసీపీ విషయంలో చూస్తే కనుక అదే జరుగుతోందా అన్న చర్చ సాగుతోంది.

మొదటి నుంది అండగా :

వైసీపీకి మొదటి నుంచి రెడ్డి సామాజిక వర్గం బలమైన అండగా ఉంటూ వస్తోంది. వైఎస్సార్ వారసుడిగా జగన్ సొంత పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన వెంట ఉంటూ వచ్చారు. 2014లో వైసీపీ మంచి పెర్ఫార్మెన్స్ చేసినా 2019లో 151 సీట్లతో అధికారం అందుకున్నా కూడా వెనక వారి మద్దతు దన్నూ చాలా కీలకంగా మారాయని చెప్పకతప్పదు. ఈ నేపథ్యంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెడ్ల విషయంలో సరైన తీరులో వ్యవహరించలేదు అన్న ప్రచారం ఉంది. ఏకంగా 50 మంది దాకా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆ సమయంలో గెలిచారు. అంటే అది చాలా పెద్ద నంబర్. అయినా కూడా ప్రభుత్వంలో పూర్తి ప్రాధాన్యత దక్కలేదన్న బాధ వారిలో ఉంది.

భారీ ఓటమి వెనక రీజన్ :

మరో వైపు చూస్తే వైసీపీ భారీ ఓటమిని 2024 ఎన్నికల్లో అందుకుంది. దాని వెనక కూడా రెడ్ల తీవ్ర అసంతృప్తి ఉందని అంటున్నారు. తమను అధికారంలో ఉన్నపుడు పెద్దగా పట్టించుకోలేదని భావించిన రెడ్డి సామాజిక వర్గం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది అని చెబుతారు. ఈ కారణంగానే ఉదాశీనంగా వారు వ్యవహరించారు అని గుర్తు చేస్తున్నారు. ఫలితంగా వైసీపీ తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేనంతగా గడ్డు పరిస్థితికి ఎందుర్కొంది అని కూడా చెబుతున్నారు. ఇక ఓటమి తరువాత ఏడాదికి పైగా కాలం గడచింది.

మార్పు రావడం లేదా :

సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఓటమి చెందాక ఆత్మ విమర్శ చేసుకుంటుంది. తమకు దన్నుగా ఉన్న వారు ఎవరు దూరం అయిన వారు ఎవరు అన్న లెక్కలు అన్నీ చూసుకుంటుంది ఒక వేళ ఏ వర్గం అయినా అసంతృప్తికి గురి అయితే కనుక వారిని దగ్గరకు తీసే కార్యక్రమం కూడా చేపడతారు. వైసీపీలో అయితే అలాంటి కార్యక్రమం జరిగిందా లేదా అన్నది తెలియదు కానీ ఒక బలమైన సామాజికవర్గంగా ఉన్న రెడ్లు మాత్రం ఇంకా అసంతృప్తిలోనే ఉన్నారని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.

ఇంకా రెడ్ సిగ్నలేనా :

రెడ్లు వైసీపీకి రెడ్ సిగ్నల్ చూపిస్తున్నారు అని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఎక్కువ మంది రెడ్లు టీడీపీలో చేరి ఆ పార్టీ విజయానికి కృషి చేశారు అంటే ఆసక్తికరమైన పరిణామంగానే చూడాలి. ముఖ్యంగా రెడ్లకు పట్టు ఎక్కువగా ఉన్న నెల్లూరు జిల్లాలో వైసీపీ ఒక్క సీటూ గెలుచుకోలేకపోయింది. ఇక రాయలసీమలోని నాలుగు జిల్లాలలో కూడా రెడ్ల ఆధిపత్యం కింద రాజకీయాలు నడిచే చోట సైతం వైసీపీకి చుక్కెదురు అయింది అంతలా వైసీపీ మీద కోపాన్ని చూపించిన రెడ్లు గడచిన పద్నాలుగు నెలలలో సైతం ఎక్కడా తగ్గడం లేదనే అంటున్నారు.

కూటమిలో అరెస్టులు అవుతున్నా :

ఇక చూస్తే వైసీపీలో ఒకనాడు చక్రం తిప్పి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అరెస్టు అవుతున్న కీలక రెడ్డి నేతల విషయంలో ఆ సామాజిక వర్గం నుంచి మద్దతు అయితే దక్కడంలేదని అంటున్నారు. రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి వంటి వారు అరెస్టు అయి జైలు గోడల మధ్యన ఉన్నారు. ఇక తాజాగా చూస్తే కనుక రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్ అయి రాజమండి జైలులో ఉన్నారు. అయితే తన కుమారుడు అరెస్టు అయిన తరువాత రెడ్లను అందరినీ కూడగట్టి గట్టి పోరాటమే చేయాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆలోచించారని ప్రచారం సాగింది అయితే పెద్దిరెడ్డి ప్రయత్నాలకు రెడ్ల నుంచి అంతగా స్పందన అయితే రాలేదని చెబుతున్నారు .

సానుభూతీ ఏదీ ?

అధికారంలో ఉన్నపుడు తమకు పెద్దగా మేలు చేయకుండా ఇపుడు తమ అవసరం ఉందని దగ్గరకు రమ్మంటే ఎలా అన్నది రెడ్లలో పేరుకుపోయిన ఒక అసహనంగా చెబుతున్నారు. మరో వైపు చూస్తే ఈ కేసులో పక్కాగా ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు చెబుతూడండంతో పాటు కేసు కీలక దశలో విచారణలో ఉన్నందువల్ల కూడా రెడ్డి సామాజిక వర్గం తమ మద్దతు ఇవ్వలేదని అంటున్నారు. బలమైన రెడ్డి సామాజిక వర్గం నుంచి సానుభూతి అయితే ఇపుడు వైసీపీకి దక్కడం లేదని అంటున్నారు. నిజానికి ఈ రకమైన పరిస్థితి ఉండకూడదు కానీ వైసీపీ అధినాయకులు చేజేతులా చేసుకున్నదే అని అంటున్నారు. అధికారంలో ఉన్నపుడు చేసిన దానికే ఇపుడు రివర్స్ లో ఫలితాలు వస్తున్నాయాని చెబుతున్నారు. ఏది ఏమైనా రెడ్డి సామాజిక వర్గం మద్దతు పొందేందుకు వైసీపీ మరింతగా గట్టి ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News