జయమంగళే కాదు.. అందరివీ తిరస్కరణే!
ఏపీ శాసన మండలిలో చిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి బయటకు వచ్చి .. ఇతర పార్టీల్లో చేరిన సభ్యులు.. తమ తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.;
ఏపీ శాసన మండలిలో చిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి బయటకు వచ్చి .. ఇతర పార్టీల్లో చేరిన సభ్యులు.. తమ తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అయితే.. వీటిని ఆమోదిం చే విషయంలో మండలి చైర్మన్ మోషేన్ రాజు నిన్న మొన్నటి వరకు తాత్సారం చేశారు. దీంతో సభ్యులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వీరికి అనుకూలంగా కాకపోయినా.. ఆయా రాజీనామాలపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.
ఈ ఆదేశాలపైనా ఆలస్యంగానే స్పందించిన చైర్మన్ మోషేన్ రాజు.. తాజాగా కృష్ణాజిల్లాకు చెందిన ఎమ్మె ల్సీ.. జయమంగళ వెంకటరమణ రాజీనామాను తిరస్కరించారు. దీనికి ఆయన పేర్కొన్న వివరణ.. ``రాజీ నామా సంతృప్తికరంగా లేదు`` అని. అనంతరం.. సదరు రాజీనామాను తిరస్కరిస్తున్నట్టు తేల్చేశారు. ఫలితంగా జయమంగళ ఇప్పుడు డోలాయమానంలో పడ్డారు. 2023లో వైసీపీ తరఫున ఆయన ఎమ్మెల్యే కోటాలో సభకు వచ్చారు.
ఇక, ఈయన ఒక్కరే కాదు.. దాదాపు మిగిలిన వారి రాజీనామాలు కూడా ఇలానే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని మండలి వర్గాలు చెబుతున్నాయి. వీరంతా వైసీపీ నుంచి సభకు నామినేట్ అయిన వారే కావడం గమనార్హం. వీరిలో.. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్, గూడూరుకు చెందిన బల్లి కల్యాణ చక్రవర్తి, పశ్చిమ గోదావరికి చెందిన పద్మశ్రీ, చీరాలకు చెందిన పోతుల సునీత ఉన్నారు. వీరు రాజీనామాలు చేసి.. రెండేళ్లకు పైగానే అయింది.
తదుపరి ఏంటి?
జయమంగళ సహా ఇతరుల రాజీనామాలు తిరస్కరిస్తే తదుపరి వీరు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. సభలో వీరు వైసీపీ తరఫునే ప్రాతినిధ్యం వహించినట్టు అవుతుంది. ఆ పార్టీ విధానాలకు అనుకూలంగానే వ్యవహరించాలి. రేపు ఏదైనా అవసరమై.. పార్టీ విప్ జారీ చేస్తే.. దానిని తూ.చ. తప్పకుండా పాటించాలి. లేక పోతే.. అనర్హత వేటు పడుతుంది. ఈ వ్యూహంతోనే వైసీపీ తెరచాటున చక్క బెడుతోందన్న వాదన వినిపిస్తోంది. ఇక, ఇప్పటికైతే.. ఒక్క రాజీనామానే తిరస్కరించినా.. హైకోర్టు ఆదేశాలతో వచ్చే వారంలోగా కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తిల రాజీనామాలపైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.