ఎంజాయ్ కోసం థాయ్ లాండ్ వెళుతున్నారా? బుక్కైపోతారు జాగ్రత్త
సరిగ్గా ఇక్కడే మన "విశాల హృదయాన్ని" ఆసరాగా చేసుకుని అక్కడొక కొత్త 'బిజినెస్ మోడల్' స్టార్ట్ చేశారు కొందరు తెలివైన మహానుభావులు!
థాయ్‌లాండ్ అంటే మనోళ్లకు ఏముంటుంది చెప్పండి? పొడుగాటి వైట్ శాండ్ బీచ్‌లూ.. రంగురంగుల రాత్రి జీవనం, చేతిలో డ్రింకు.. అబ్బా ఊహించుకుంటేనే 'మానసిక ప్రశాంతత' వచ్చేస్తుంది కదా? అందుకే ఏ చిన్న సెలవు దొరికినా హైదరాబాద్ నవాబుల నుంచి బెంగళూరు టెక్కీల వరకు అందరూ విమానమెక్కి బ్యాంకాక్ వాలిపోతున్నారు. సరిగ్గా ఇక్కడే మన "విశాల హృదయాన్ని" ఆసరాగా చేసుకుని అక్కడొక కొత్త 'బిజినెస్ మోడల్' స్టార్ట్ చేశారు కొందరు తెలివైన మహానుభావులు!
ఉద్యోగాల పేరిట, 'రూ.999లకే థాయ్‌లాండ్ ట్రిప్' అనే మైండ్ బ్లాకింగ్ ఆఫర్ల పేరిట మనోళ్లను ఆకర్షించడం.. తీరా అక్కడికి వెళ్లాక "సర్ ప్రైజ్" అని చెప్పి పటాస్ పట్టాయాలోని ఓ చిన్న గదిలో బంధించడం.. ఎంతైనా విదేశీ ఆతిథ్యం కదా కాస్త డిఫరెంట్‌గా ఉండాలి మరి. ఇటీవల ముగ్గురు భారతీయ సోదరులు తక్కువ ఖర్చుతో థాయ్ అందాలు చూసొద్దామని వెళ్లి అక్కడ వారం రోజుల పాటు "ఫ్రీ టార్చర్ అండ్ కిడ్నాప్ పార్కేజీ"ని ఉచితంగా పొంది వచ్చారు. బాధితుల చేతే వాళ్ల ఇంట్లో వాళ్లకు వీడియో కాల్స్ చేయించి "డబ్బులు పంపండి మహాప్రభో లేదంటే మమ్మల్ని పీసెస్ చేసేస్తారు" అని బెదిరింపులు.. ఇంకా కామెడీ ఏంటంటే.. ఈ గ్యాంగ్‌లో మన భారతీయులు కూడా ఉన్నారట. "వసుధైక కుటుంబకం" అంటే ఇదేనేమో..
ఇక ఉద్యోగాల అడ్వర్టైజ్‌మెంట్ల కథ ఇంకో రేంజ్. "డేటా ఎంట్రీ చేస్తే చాలు లంబోర్గిని కారు కొనుక్కోవచ్చు" అని సోషల్ మీడియాలో కలల ప్రపంచం చూపిస్తారు. అది నమ్మి బ్యాంకాక్‌లో ల్యాండ్ అయితే హ్యాపీగా మయన్మార్ సరిహద్దులకు పార్శిల్ చేసేస్తారు. అక్కడ పాస్‌పోర్టులు లాక్కొని "ఇప్పుడు సరిగ్గా ఆన్‌లైన్ స్కామ్‌లు చేయండి బాస్" అని బెత్తం పట్టుకుని కూర్చుంటారు. ఐటీ కారిడార్‌లో ల్యాప్‌టాప్ ముందు కూర్చోవాల్సిన మనోళ్లు... అక్కడ 'గన్ పాయింట్'లో స్కామ్‌లు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
ప్రియమైన ప్రయాణికులారా.. సోషల్ మీడియాలో ఎవడో అపరిచితుడు "ఉచిత వీసా.. భారీ జీతం.. ఫ్రీగా బ్యాంకాక్ ప్యాకేజీ" అనగానే చొక్కా నలిగిపోకుండా సర్దుకుని వెళ్ళిపోకండి.. అక్కడికి వెళ్లాక మీ పాస్‌పోర్ట్ పోయి, ఫోన్ పోయి, కడపటి వీడియో కాల్ ద్వారా కుటుంబ సభ్యులకు దర్శనమివ్వాల్సి వస్తుంది. కాస్త అధికారిక రిక్రూట్‌మెంట్లు, నమ్మకమైన ఏజెన్సీలను ఆశ్రయించండి. లేదంటే మీరు థాయ్‌లాండ్ టూర్ చూద్దామని వెళ్తే.. వాళ్లు మీకు "లైఫ్‌టైమ్ రియాలిటీ షో" చూపించేస్తారు, జాగ్రత్త..