16 మంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ నా ?
జంపింగ్ లకు నో అన్ సీజన్. రాజకీయాల్లో ఎపుడైనా అవి జరగవచ్చు. అటూ ఇటూ రాయబేరాలు సరిపోతే గోడ మీద నుంచి దూకేయడమే.;
జంపింగ్ లకు నో అన్ సీజన్. రాజకీయాల్లో ఎపుడైనా అవి జరగవచ్చు. అటూ ఇటూ రాయబేరాలు సరిపోతే గోడ మీద నుంచి దూకేయడమే. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు రాజకీయలో థియరీ ఇదే. నీతీ రీతి కూడా ఇలాగే ఉంటుంది. అందుకే దానికి పాలిటిక్స్ అనడం లేదు. పాలిట్రిక్స్ అంటారు. ఇపుడు చూస్తే జంపింగుల ప్రాక్టీస్ ఎవరికి అవసరం అంటే కష్టాల్లో ఉన్న వైసీపీ మాజీలకే అని అంటున్నారు. కూటమి కట్టి మూడు పార్టీలు ఐక్యంగా బలంగా ఉన్నాయి. విపక్షంలో ఉన్న వైసీపీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నాయి.
వరస కేసులు అరెస్టులూ :
ఇదిలా ఉంటే వైసీపీ నేతలందరికీ ఇపుడు ఒక్కటే బెంగ పట్టుకుంది. కేసులు అరెస్టులే ఆ భయం. కేసు పెట్టిన వారు సక్రమం అంటారు, పెట్టించుకున్న వారు అక్రమం అంటారు. ఈ గోల ఘోష ఎలా ఉన్నా బాధితులుగా మాత్రం మారి జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తోంది. ఇక ఒకసారి జైలుకు వెళ్తే ఒకటి కంటే ఎక్కువ కేసులు వరసగా కలుపుకుని పోతున్నారు. దాంతో ఎపుడు బయటకు బెయిల్ మీద వస్తారో కూడా అంతు చిక్కడం లేదు. దాంతో ఇపుడు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులలో ఈ అరెస్టు భయాలు గట్టిగానే పట్టుకున్నాయని అంటున్నారు.
కలవరపెడుతున్న రెడ్ బుక్ :
బయటకు రెడ్ బుక్ రాజ్యాంగం అని ఎంత విమర్శించినా కూటమి ప్రభుత్వాన్ని ఎంతగా నిందించినా అరెస్టులు అలా జరిగిపోతూనే ఉన్నాయి. దాంతో వైసీపీ మాజీలు అంతా రెడ్ బుక్ కేసుల మీదనే అందోళన పడుతున్నారు. రెడ్ బుక్ లో తమ పేర్లు ఉన్నాయనో లేక ఉంటాయనో వారు అంతా కలవరం చెందుతున్నారు అని అంటున్నారు. వైసీపీ నేతలలో భయం అంతకంతకు పెరిగిపొతోంది. ఇది అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది అని అంటున్నారు.
జగన్ ఎన్ని చెప్పినా :
నిజానికి పార్టీ నాయకులలో ధైర్యం నింపడానికి జగన్ ఎంత ప్రయత్నం చేసినా అది అంతగా ఫలించడం లేదు అని అంటున్నారు. మన ప్రభుత్వం వస్తే అందరికీ చుక్కలు చూపిస్తామని లెక్కలు తేలుస్తామని సినిమా చూపిస్తామని జగన్ చెప్పవచ్చు కాక కానీ ఇపుడు కూటమి వారి చేతిలో అధికారం ఉంది. దాంతో వారు కచ్చితంగా ఆ సినిమాను చుక్కలను చూపిస్తున్నారు అని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వస్తే అంటున్నారు. కానీ ఈ లోగా నేతలను తీసుకెళ్ళి జైలులో వేస్తే సమాజంలో పరువు దెబ్బతినిపోతుంది కదా అన్నది కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులలో కలవరంగా ఉంది అని అంటున్నారు.
డౌట్ ఉంటే చాలు జంపే :
రెడ్ బుక్ లో ఎవరి పేర్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. అయితే గత అయిదేళ్ళ తమ పాలను బేరీజు వేసుకునో లేక తాము ఎక్కడ ఏమి చేశామో రివీల్ చేసుకునో లేక తమ నియోజకవర్గంలో కూటమి నాయకుల దూకుడుని అంచనా కట్టుకునో చాలా మంది వైసీపీ నేతలు కొత్త ఆలోచనలు చేస్తున్నారు అని అంటున్నారు. రెడ్ బుక్ లో పేరు చేర్చేస్తున్నారు అని ఏ మాత్రం డౌట్ వస్తే చాలు వారు అంతా సేఫ్ జోన్ చూసుకోవడానికి సిద్ధపడుతున్నారని అంటున్నారు. ఈ విధంగా ఆలోచిస్తున్న నేతలకు జనసేన కంటే బీజేపీలోకి వెళ్తే సేఫ్ అని కూడా భావన కలుగుతోందిట.
బీజేపీలోనే భద్రం :
ఎందుకంటే ఏపీ బీజేపీ వీక్ గా ఉంది. పైగా అందులో చేరితే నాయకత్వం పోరు ఉండదు, ఇక పార్టీ కూడా అక్కున చేర్చుకుని కాషాయం కండువా కప్పేస్తుంది. ఆ మీదట అతి పెద్ద రక్షణ కవచం దొరికినట్లే అని అంటున్నారు. ఎటూ ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలన్న ఆలోచన వారిలో ఉంది. దాంతో దీనినే సాకుగా తీసుకుని కమలానికి రాయబారాలు పంపే వైసీపీ మాజీల లిస్ట్ బాగా పెరీపోతుందని అంటున్నారు.
వీరంతా కమల కుటీరంలోకేనా :
ఏపీ వైసీపీలో ఉన్న పదహారు మంది మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకులు అంతా బీజేపీలోకి జంప్ చేయడానికి రెడీ అయ్యారని వార్తలు గుప్పుమంటున్నాయి. వీరంతా ప్రస్తుతానికి బీజేపీలోనే తాము ఉండడం అన్ని రకాలుగా మేలు అని భావిస్తున్నరుట. బీజేపీ కూటమిలో ఉంది. పైగా కేంద్రంలో బలంగా ఉంది. దాంతో కమలం పువ్వు పట్టుకుంటే చాలు ఎవరూ తమ జోలికి రారు అని బాగానే రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు అని అంటున్నారు.
వైసీపీ సంగతి అపుడే :
వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళాలని చూస్తున్న వారు ఆ పార్టీ మీద అభిమానం లేక కాదని అంటున్నారు. తాము రెడ్ బుక్ నుంచి తప్పించుకోవడానికే అంటున్నారు. ఒకవేళ 2029 ఎన్నికల నాటికి ఏపీలో వైసీపీ వచ్చే అవకాశం ఉంటే కనుక మళ్ళీ ఎన్నికల ముందు ఈ వైపునకు రావచ్చు అన్న లెక్కలు కూడా ఉన్నాయట. అవసరం అయితే కులం కార్డు కూడా తీసి అయినా వైసీపీలోకి తిరిగి రావచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం ఫ్యాన్ నీడన ఉండడం రాజకీయంగా ఇబ్బందికరం అని భావిస్తున్నారు అని చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఒకేసారి పదహారు మంది వైసీపీ నుంచి పెద్ద తలకాయలు బీజేపీలోకి వెళ్తారు అంటే గుడ్ నంబర్ గానే చూడాలి. బీజేపీకి ఇది అతి పెద్ద రాజకీయ అవకాశంగా చూస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.