ఏపీలో మళ్లీ అదే సీన్.. ఈసారి జక్కంపూడి రాజా వంతు!
తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు.;
ఏపీలోని కూటమి సర్కారులో ఒక సీన్ తరచూ రిపీట్ అవుతూ ఉంటోంది. విపక్ష వైసీసీ నేతల ఆగ్రహం.. ప్రభుత్వ అధికారులకే కాదు.. పోలీసు అధికారులకు సూటిగా హెచ్చరికలు చేసే పరిస్థితి తరచూ చోటు చేసుకుంటూ ఉంటోంది. సాధారణంగా విపక్షంలో ఉన్న వారు హెచ్చరికలు చేసే ధైర్యం చేయరు. చాలా తక్కువ సందర్భాల్లోనే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంటుంది. అందుకు భిన్నంగా కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత నుంచి అదే పనిగా అధికారులకు వార్నింగ్ లు ఎదురవుతూ ఉంటున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలు వైసీపీ కీలక నేతలు పేర్ని నాని.. అంబటి రాంబాబు.. ఇలా ప్రతి ఒక్కరు అధికారులపై విరుచుకుపడుతున్న పరిస్థితి.
తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోలీసు అధికారిపై విరుచుకుపడ్డారు. ఏం చేస్తావయ్యా.. నువ్వేం చేస్తావు.. అంటూ బిగ్గరగా అరుస్తూ సీఐపైకి దూసుకెళ్లిన వైనం సంచలనంగా మారింది. స్థానికంగా జరుగుతున్న ఎన్నికల్లో ఇద్దరు ఓటర్లను వైసీపీ నేతలు కిడ్నాప్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో విచారణకు వచ్చిన పోలీసులు.. వైసీపీ నేత భర్తను కొట్టారన్న ఆరోపణలపై జక్కంపూడి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
అంతేకాదు.. పోలీసు స్టేషన్ కు వెళ్లిన జక్కంపూడి అక్కడ సీఐతో వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. జక్కంపూడి రాజాకు మద్దతుగా మాజీ మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల క్రిష్ణ.. తానేటి వనిత.. దాడిశెట్టి రాజా.. మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు.. పెద్దాపురం వైసీపీ ఇన్ ఛార్జి దవులూరి దొరబాబు వీరికి మద్దతుగా అక్కడకు చేరుకొని పోలీసులకు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
రంగంపేట మండలం దొడ్డిగుంటలో ఈ నెల 29న మత్స్య సహకారసంఘం ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ఓటర్లను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారన్నది ఆరోపణ. దీనికి సంబంధించి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన దొడ్డిగుంట ఎంపీటీసీ సభ్యురాలు మడికి వీరలక్ష్మి భర్తను పోలీసులు కొట్టారన్నది వైసీపీ నేతల వాదన.
మరోవైపు కిడ్నాప్ చేసిన ఇద్దరు ఓటర్లను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి.. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జి నల్లమిల్లి మనోజ్ రెడ్డిలతో పాటు పలువురు ఆందోళనకు దిగారు. అయితే.. ఈ ఉదంతంలో విపక్ష వైసీపీకి చెందిన నేతలంతా తరలిరాగా.. కూటమి ప్రభుత్వానికి చెందిన నేతలు మాత్రం పెద్దగా స్పందించలేదన్న మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు.. బాధితుల పక్షాన నిలవటం.. అండగా ఉంటామన్న భరోసా ఇచ్చే విషయంలో కూటమి నేతల కంటే విపక్ష వైసీపీ నేతలే మెరుగ్గా ఉన్నారన్న మాట వినిపించటం గమనార్హం.