కార్యకర్తా...ఎక్కడున్నావయ్యా ?

కార్యకర్తలే కీలకం అని ఇపుడు అన్ని పార్టీలు వల్లిస్తున్నాయి. వారితో తాము అని కూడా చెబుతున్నాయి. కార్యకర్తలను పట్టించుకుంటూ వారికే పట్టం కడుతూ నాయకుల ప్రసంగాలు సాగుతున్నాయి.

Update: 2026-10-03 14:30 GMT

ఏడుకొండల స్వామీ ఎక్కడున్నావయ్యా అని భక్తులు భక్తి పారవశ్యంగా పాడుకుంటారు. అది ఆధ్యాత్మిక తత్వం. రాజకీయాల్లో కూడా అసలైన స్వామి కార్యకర్త అన్నది తెలిసిందే. ఎన్నికల సమయంలో స్వామి ఆ మీదట ఆసామి అన్న సెటైర్లు కూడా కార్యకర్తల మీద ఉన్నాయి. అంటే కూరలో కరివేపాకు అన్న మాట. కార్యకర్తలు గట్టిగా పూనుకోకపోతే ఏ పార్టీకి అయినా విజయాలు దక్కవు అన్నది పచ్చి నిజం. బూత్ లెవెల్ నుంచి క్షేత్ర స్థాయిలో ఎక్కడ ఎన్నికల సమరం జరిగినా ముందుండే సైనికుడు కార్యకర్త. ప్రతీ పార్టీకి జీవగర్ర కార్యకర్త అని స్పష్టంగా చెప్పాల్సిందే. అయితే కార్యకర్తలతో అవసరం ఉన్నపుడే దగ్గరకు తీస్తున్నారు. ఒక్కసారి అధికారం దక్కితే మాత్రం వారికి ఎక్కడో వదిలేస్తున్నారు. పదవులు పవర్ అన్నీ కూడా నాయకుల చుట్టూ తిరిగేవారికే దక్కుతున్నాయి. దాంతో అసలైన కార్యకర్తలు మాత్రం తీరని అన్యాయానికి గురి అవుతున్నారు.

వారికే వందనం :

కార్యకర్తలే కీలకం అని ఇపుడు అన్ని పార్టీలు వల్లిస్తున్నాయి. వారితో తాము అని కూడా చెబుతున్నాయి. కార్యకర్తలను పట్టించుకుంటూ వారికే పట్టం కడుతూ నాయకుల ప్రసంగాలు సాగుతున్నాయి. మీరు లేకపోతే మేము లేమని సెంటిమెంట్ డైలాగులు కూడా కొడుతున్నారు. చిత్రమేంటి అంటే ఏ పార్టీ అయినా అధికారం దక్కాక కార్యకర్తలను చిన్న చూపు చూడడం షరా మామూలు వ్యవహారంగానే ఉంటోంది. ఇక టీడీపీలో అయితే కార్యకర్తల విషయంలో ఒక చానల్ ని ఏర్పాటు చేసి ఎంతో కొంత గుర్తింపు ఇస్తున్నారు. వైసీపీ విషయానికి వస్తే క్యాడర్ ని విస్మరించడం వల్లనే 2024 లో చేదు ఫలితాలు వచ్చాయన్నది తెలిసిందే. 2019 కి ముందు ఏకంగా పదేళ్ల పాటు పార్టీ కోసం తమ జీవితాలను అర్పించిన కార్యకర్తలు వైసీపీలో ఎంతో మంది ఉన్నారు.

రెక్కలు ముక్కలు చేసుకుని :

వైఎస్సార్ మీద ప్రేమ జగన్ మీద అభిమానం ఇవన్నీ వారి చేత ఎందాకైనా అన్నట్లుగా పరిశ్రమ చేయించాయి. జగన్ ముఖ్యమంత్రి కావాలని గట్టి పట్టుదలతో వారు ఆనాటి అధికార ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో అన్ని విధాలుగా నష్టపోయారు. కాలం, వయసు, ధనం కుటుంబాలు ఇలా అన్నీ కూడా ధారపోసి వైసీపీని గెలిపిస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను పూర్తిగా పక్కన పెట్టేసింది. కార్యకర్తలకు పార్టీకి మధ్యలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకుని వచ్చింది. దీంతో కార్యకర్తలు నివ్వెరపోవాల్సి వచ్చింది. తాము పార్టీలో ఉన్నామా లేదా అన్న సంశయంతో పాటు ఆత్మ గౌరవం దెబ్బతిని తీరని అవమానంతో ఆ అయిదేళ్ళూ గడిపారు. అధినాయకత్వం తీరు అలా ఉంటే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల వరసగా అలాగే ఉంది. వారి చుట్టూ ఉంటే అనుచరులకే ప్రాధాన్యత ఇస్తూ సిసలైన కార్యకర్తలను అసలు ఏ మాత్రం పట్టించుకోలేదు. దాంతో కార్య్కర్త పార్టీ జెండా వదిలేశాడు. దానికి వైసీపీ భారీ మూల్యం 2024 ఎన్నికల్లో చెల్లించుకోవాల్సి వచ్చింది.

అండగా ఉంటామని అంటూ :

భారీ ఓటమి తరువాత వైసీపీకి తత్వం బోధపడిందా లేక కార్యకర్తలతో అవసరం పడిందా అన్నది పక్కన పెడితే ఇపుడు కార్యకర్తల వద్దకు వెళ్తున్నారు. మీరే మాకు కావాలని మొక్కుతున్నారు. బాగా చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. ఇలా ఇపుడు రెండేళ్ళ తరువాత కార్యకర్తల వద్దకు వైసీపీ నేతలు పరుగులు పెట్టి మరీ వెళ్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వారితోనే చేయాల్సి ఉంది కాబట్టి. వైసీపీ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో సమావేశాలను ఏర్పాటు చేస్తోంది. అలా చేయమని అధినాయకత్వం ఆదేశించింది. అంతే కాదు పార్టీ తరఫున గుర్తింపు కార్డులు కూడా కార్యకర్తలకు అందచేస్తున్నారు ఈ ఐడెంటిటీ కార్డులు ఉన్న వారికి ఐదు లక్షల ప్రమాద బీమా సదుపాయం కూడా కల్పించారు. మీకు మేము అన్ని విధాలుగా మద్దతుగా ఉండి సహకరిస్తామని నాయకులు చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడాలని సూచిస్తున్నారు.

ముఖాలను చూపించకుండా :

అయితే ఈ ఐడెంటిటీ కార్డులు ప్రమాదం ముంచుకొస్తే అపుడు కుటుంబానికి వచ్చే పరిహారాలు కాదు తమకు ఏమైనా అవకాశాలు దక్కుతాయా లేదా అన్నదే కార్యకర్తలు నాయకులను అడుగుతున్న ప్రశ్న. తాము ఇప్పటికి పదిహెనేళ్ళుగా పార్టీ కోసం పనిచేసి ఏమీ కాకుండా పోయామన్న ఆవేదన అయితే ప్రతీ వైసీపీ కార్యకర్తలో నిండా ఉంది. కనీసం పార్టీ నాయకులు తమ ముఖాలను కూడా చూపించకుండా గడిపేశారు అన్న విమర్శలు ఉన్నాయి. ఇపుడు తాపీగా మీకు మేమున్నామని అంటూంటే క్యాడర్ దానిని ఏ విధంగా తీసుకుంటుంది అన్నది చర్చగా ఉంది మరి.

పనిచేసే వారికి :

నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసే వారిని గుర్తించి పోటీ చేయించమని వైసీపీ అధినాయకత్వం గట్టిగా చెబుతోంది. కానీ గతంలోనూ ఇపుడూ కూడా పార్టీ నాయకుల చుట్టూ తిరిగే కొందరికే అవకాశాలు ఉంటున్నాయని వాపోతున్న వారు ఉన్నారు. బలం ఉన్న వారిని సమర్ధులను గుర్తించి ప్రోత్సహిస్తేనే ఆశించిన ఫలితాలు దక్కుతాయని అంటున్నారు. ఈ విషయంలో వైసీపీ క్యాడర్ లో అంతర్మధనం సాగుతోంది. తమకు చాన్స్ దక్కాల్సిందే అన్న డిమాండ్ అయితే సర్వత్రా వినిపిస్తోంది. కార్యకర్తలు ఎక్కడ ఉన్నారని వెతుక్కుంటూ రావడం కాదని వారికి గుర్తింపు గౌరవం ఇవ్వడమే కాకుండా రాజకీయ అవకాశాలు అందిస్తే వారే అందరి కంటికీ స్పష్టంగా కనిపిస్తారు అని అంటున్నారు. మరి స్థానిక ఎన్నికల్లో వైసీపీ నిజమైన కార్యకర్తలకు పట్టం కడుతుందా లేక వారి అవసరం కోసం ఈ విధంగా హామీలు ఇస్తోందా అన్నది తొందరలోనే తేలిపోతుందని అంటున్నారు. కార్యకర్తలే పార్టీకి అసలైన ఆస్తి అన్న సంగతిని ఇప్పటికైనా గుర్తెరిగితేనే వైసీపీకైనా మరే పార్టీకైనా సుదీర్ఘమైన భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News