ఆ వర్గాలు వైసీపీకి ఇంకా దూరమేనా...ఇలాగైతే ఎలా ?

వైసీపీ రెండు సార్లు ప్రతిపక్షంలో ఒకసారి అధికారంలో ఉంది. 2014 నుంచి 2019 మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కధ వేరు.

Update: 2026-08-24 03:47 GMT

వైసీపీ రెండు సార్లు ప్రతిపక్షంలో ఒకసారి అధికారంలో ఉంది. 2014 నుంచి 2019 మధ్య వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కధ వేరు. అప్పట్లో వైసీపీ మీద ఆశలు ఆకాంక్షలు చాలానే ఉన్నాయి. జగన్ వైఎస్సార్ వారసుడిగా కంటికి కనిపిస్తున్నారు. ఆయన అధికారంలోకి వస్తే ఎలా పాలిస్తారు అన్నది జనంలో ఉత్సుకత ఉండేది. దాంతోనే 2014లో తృటిలో తప్పిన అధికారాన్ని 2019లో జనాలు 151 సీట్లతో కట్టబెట్టారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కాస్తా వైసీపీకి నూరు శాతం టర్న్ అయింది. ఎందుకంటే వైసీపీ ఎపుడూ అధికారంలో లేదు కనుక. కానీ 2024 తరువాత నుంచి వైసీపీ ప్రతిపక్ష పాత్ర భిన్నంగా ఉంది అని అంటున్నారు.

మరింతగా శ్రమించాలి :

వైసీపీ 2019 నుంచి 2024 మధ్యలో అధికారంలో ఉంది. దాంతో వైసీపీ ప్రభుత్వం వల్ల లబ్ది పొందిన సంక్షేమ వర్గాలు ఉంటే ఇబ్బంది పడిన వర్గాలూ ఉన్నాయి. అలాగే ప్రభుత్వ విధానాలు ప్రాధాన్యతలు నచ్చని వర్గాలు కూడా దూరం జరిగాయి. ఈ వర్గాలు అన్నీ కూడా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమికి జై కొట్టాయి. అయితే వైసీపీ ఓటమి పొంది రెండేళ్ళ పై చిలుకు అయింది కానీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుందా అన్నది ఒక పెద్ద ప్రశ్న. అంతే కాదు నిజాయతీగా ఆత్మ విమర్శ చేసుకుందా అన్నది మరో ప్రశ్న. నిజానికి వైసీపీ మాత్రమే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా చేయాల్సింది ఇదే. కానీ వైసీపీ ఈ విషయంలో పెద్దగా ఆలోచిస్తున్నట్లు లేదని అంటున్నారు. కూటమి ప్రభుత్వం నుంచి వచ్చే వ్యతిరేకత తమను గెలిపిస్తుందని వైసీపీ ఆశలు పెట్టుకుంటోంది అన్నది ఆ పార్టీ నేతల మాటలను బట్టి అర్థం అవుతోంది.

కీలక వర్గాల సంగతేంటి :

వైసీపీ పాలనలో దూరమైన కీలక వర్గాల సంగతేంటి అన్న చర్చ సాగుతోంది. నిజానికి ఏ పార్టీ అయినా పటిష్టంగా ఉండాలీ అంటే సమాజంలోని కీలక వర్గాల మద్దతు అభిమానం తప్పనిసరి. అధినేతల ఇమేజ్ కొంత మేరకు మాత్రమే పనిచేస్తుంది, ప్రజలు కూడా ఆ పార్టీల పట్ల ఆదరణ చూపిస్తూ గెలవాలని ఆకాక్షించాలి. వైసీపీ విషయానికి వస్తే అధికారంలో ఉన్నపుడు దూరమైన వర్గాలలో ఉద్యోగ వర్గం అతి పెద్దది. ప్రభుత్వ ఉద్యోగులు ఏపీలో ఆరు లక్షలకు పైగా ఉన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ సచివాలయం ఇతరత్రా ఉద్యోగులు కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 13 లక్షల దాకా అవుతుందని అంటారు. ప్రతీ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటారని అనుకుంటే 50 లక్షల మంది దాకా వేరు ఉంటారు అని అంటున్నారు. మరి వీరి అభిమానం తిరిగి పొందడానికి వైసీపీ ఏమి చేసింది అన్నదే ప్రశ్న. వైసీపీకి ఉద్యోగ వర్గాలు దూరంగానే ఈ రోజుకీ ఉంటున్నారు అన్న విశ్లేషణలు ఉన్నాయి.

కార్మిక వర్గం సైతం :

అంతే కాదు కార్మిక వర్గం సైతం వైసీపీ ఏలుబడిలో ఇబ్బంది పడింది అని అంటారు. అప్పట్లో అభివృద్ధి పెద్దగా లేకపోవడంతో భవన నిర్మాణ కార్మికులు అంతా ఉపాధి సమస్యలు ఎదుర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికులు అయితే ఇసుక సంక్షోభం కారణంగ్గా చాలా మంది కార్మికులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నారు. అలా వారంతా గుర్రుగా ఉండి 2024 ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు చేశారు. ఇపుడు టీడీపీ కూటమి హయాంలో పరిశ్రమలు ఏర్పాటు అవడం భవన నిర్మాణాలు జోరుగా సాగడం అభివృద్ధి కారణంగా వారికి ఉపాధి లభిస్తోంది. దాంతో వారు కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారని అంటున్నారు.

కీలక సెక్షన్ ఇదే :

ఇక మధ్య తరగతి వర్గం కీలకంగా ఎన్నికల్లో ఉంటుంది. వారిలోనే చదువరులు, విద్యావంతులు ఉంటారు. వారు నోటితో చేసే ప్రచారమే ఏ పార్టీకి అయినా అనుకూలం అవుతుంది, అలాగే వ్యతిరేకం కూడా అవుతుంది, ముఖ్యంగా మధ్య తరగతి వర్గం ఎపుడూ అభివృద్ధి ఆర్థిక స్థిరత్వం కోరుకుంటుంది. అమరావతి రాజధాని విషయంతో పాటు అభివృద్ధిలో వైసీపీ కంటే కూటమి మేలు అని ఈ వర్గం భావిస్తోంది. అలాగే రహదారులు ఇతర మౌలిక సదుపాయాలు కూడా వారు ఇచ్చే ప్రాధాన్యతలలో ఒకటిగా ఉంటాయి. కూటమి హయాంలో అభివృద్ధి సాగుతోని కాబట్టి ఈ వర్గాలు బాగానే ఉన్నాయని అంటున్నారు.

అతి పెద్ద వర్గం తోనే :

ఇక ఏపీలో మొత్తం ఓటర్లు దాదాపుగా నాలుగు కోట్లకు దగ్గరలో అటూ ఇటుగా ఉంటే వారిలో సగానికి పైగా మహిళా ఓటర్లే ఉంటారు. వీరి విషయంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రద్ధ చూపిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడం ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇవ్వడం, ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం పధకం అమలు చేయడం ద్వారా కూటమి ప్రభుత్వం వీరి అభిమానాన్ని చూరగొంటోంది. దీంతో పాటుగా వీరి కోసం ప్రత్యేక కార్యక్రమాలను కూటమి అమలు చేస్తోంది. దాంతో ఈ అతి పెద్ద వర్గంలో మెజారిటీ అయితే కూటమి పాలన పట్ల సంతృప్తిగా ఉందని అంటున్నారు. మరి ఈ వర్గాలు అన్నీ వైసీపీకి ఈ రోజుకీ దూరంగా ఉంటే వారికి దగ్గర చేసుకోవడం మీద శ్రద్ధ చూపించకుండా మేమే గెలిచేస్తామంటే ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

Tags:    

Similar News