సోషల్ మీడియాపై చంద్రబాబు గురి.. !
ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలువురు మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం లీకేజీ ఘటన.. దీనిని ఆసరా చేసుకుని కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సోషల్ మీడియా ఉద్యమం సక్సెస్ కావడం తో యువతకు చేరువ అయ్యేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా సోషల్ మీడియాను వినియోగించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు ఇదే పంథాలో చంద్రబాబు కూడా ఆలోచన చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ఎలా ఉన్నారన్న విషయంపై ఆయన ఆరా తీశారు.
ఇటీ వల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలువురు మంత్రుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. మంత్రుల్లో నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వంగల పూడి అనిత, ఫరూక్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లు మాత్రమే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. వారు చేస్తున్న పనులు, తీసుకున్న నిర్ణయాలు, ప్రజలతో మమేకం అవుతున్న తీరును సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
అయితే.. ఇప్పుడు ఇది చాలదని చంద్రబాబు తేల్చి చెప్పారు. సోషల్ మీడియా ద్వారా యువతకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని అన్నారు. సోషల్ మీడియాలో ఉన్న ఫేస్‌బుక్, ఇన్ స్టా, వాట్సాప్, ఎక్స్ .. ఇలా దేనినీ వదిలి పెట్టవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం యువత ఎక్కువగా వాట్సాప్, ఇన్‌స్టా కు అలవాటు పడ్డారని.. వారిని మచ్చిక చేసుకునేందుకు వీటిని వినియోగించుకునేందు కు ప్రయత్నించాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా జగన్ ప్రారంభించిన `జగన్ 2.0` యాప్ కూడా చర్చకు వచ్చింది. చంద్రబాబు ఈ యాప్ ఎలా ఉందంటూ మంత్రులను ఆరా తీశారు. దీనిని మీరు చేయలేరా? ఇలా ప్రజలకు చేరువ కాలేరా? అని ప్రశ్నించిన ఆయన.. ఎవరి వారు ప్రోయాక్టివ్‌గా ఉండాలని.. వచ్చే రెండేళ్లలో యువత ఓటు బ్యాంకు పెరుగుతోందని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ.. సోషల్ మీడియా లో యాక్టివిటీలను ప్రారంభించి.. దూకుడుగా వ్యవహరించాలన్నారు. అలానే ప్రధాన మీడియాను వదిలేయొద్దని సూచించారు.